వికాస్ దూబే అరెస్టు
ABN , First Publish Date - 2020-07-10T06:54:10+05:30 IST
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, ఇటీవల కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పాశవికంగా కాల్చిచంపిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు రోజులుగా దూబే కోస్ ఉత్తరప్రదేశ్ పోలీసులు వేట సాగించినా...

- మధ్యప్రదేశ్‌లో దొరికిన యూపీ గ్యాంగ్‌స్టర్
- ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పట్టివేత
- కాన్పూర్‌లో 8 మంది పోలీసుల హత్య
- ఆ తర్వాత పరారీలో గ్యాంగ్‌స్టర్ దూబే
- ఆరు రోజులుగా వేట సాగించిన పోలీసులు
- మరో ఇద్దరు అనుచరుల ఎన్కౌంటర్
- దూబే తోకాడిస్తే చంపేస్తామేమో: ఐజీ
భోపాల్/లఖ్‌నవూ, జూలై 9: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, ఇటీవల కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పాశవికంగా కాల్చిచంపిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు రోజులుగా దూబే కోస్ ఉత్తరప్రదేశ్ పోలీసులు వేట సాగించినా.. నిందితుడు గురువారం ఉదయం ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి వచ్చి, మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కాడు. దూబేతోపాటు.. అతడి అనుచరులిద్దరినీ అరెస్టు చేశామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు. ‘‘గురువారం ఉదయం ఉజ్జయినీలోని మహంకాళి ఆలయానికి దూబే కారులో వచ్చినట్లు మా కానిస్టేబుల్ గుర్తించారు. అప్పుడే ఆలయానికి చెంది న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పోలీసు శాఖ కు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు అతణ్ని అరెస్టుచేశారు’’ అని వివరించారు. అయితే.. ఆలయ వర్గాల కథనం భిన్నంగా ఉంది. ఉదయం దూబే ఆలయంలోకి వచ్చి పోలీసు చెక్‌పోస్టు వద్ద ఉన్న కౌంటర్లో రూ.250 దర్శనం టికెట్‌ను కొనుగోలు చేశాడని తెలిపారు.
వీఐపీలు, ఉన్నతస్థాయి వ్యక్తుల సిఫారసుతోనే ఈ టికెట్ జారీ చేస్తారని సమాచారం. అతను ప్రసాదం కౌంటర్ వద్ద ఉండగా అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని వివరించారు. తొలుత ఆల య సెక్యూరిటీ సిబ్బంది అతడిని ప్రశ్నించగా తప్పుడు ఐడీకార్డు చూపించి, వాగ్వాదానికి దిగాడని తెలిపారు. అప్పుడే పోలీసులొచ్చి అదుపులోకి తీసుకున్నారని వివరించారు. కాగా.. పోలీసులు వికా్‌సను పేరు చెప్పమని ఆదేశించగా.. ‘‘మై వికాస్ దూబే.. కాన్పూర్ వాలా’’ అని గట్టిగా అరిచాడని తెలిసింది. గత శుక్రవారం రాత్రి యూపీలోని చౌబేపూర్ సమీపంలో ఉన్న బిక్రూలోని తన గృహంలో దూబే, అతడి అనుచరులు ఒక డీఎస్పీ సహా.. 8 మందిని అతి దారుణంగా చంపేశాడు. హత్యలు, హత్యాయత్నాలు సహా.. 60 క్రిమినల్ కేసుల్లో దూబే ప్రధాన నిందితుడు. కాన్పూర్ ఘటన తర్వాత యూపీ పోలీసులు దూబే తలపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. కడపటి వార్తలందే సమయానికి దూబేను యూపీ పోలీసులు రోడ్డు మార్గం గుండా లఖ్‌నవూకు తరలిస్తున్నారు.
పెట్రోల్ పోసి కాల్చేద్దామనుకున్నాం: దూబే
‘‘8 మంది పోలీసులను చంపిన తర్వాత మృతదేహాలను సాక్ష్యాధారాలు దొరకకుండా తగలబెట్టాలనుకున్నాం. అప్పుడే మరో పోలీసు బృందం రావ డంతో పారిపోయాం’’ అని పోలీసు విచారణలో దూబే అన్నట్లు సమాచా రం. ‘‘మాకు స్థానిక చౌబేపూర్ పోలీసులు సహకరిస్తున్నారు. అక్కడి సిబ్బందిని నేను పోషిస్తున్నాను. మరుసటి రోజు స్పెషల్ టీం నన్ను అరెస్టు చేయడానికి వస్తుందని ఉప్పందించారు. కానీ, పోలీసులు రాత్రే వచ్చారు. దాంతో వారిపై కాల్పులు జరిపాం’’ అని అంగీకరించినట్లు తెలిసింది.
ఎన్కౌంటర్ చేస్తారా?
దూబేలాంటి గ్యాంగ్స్టర్లు పోలీసులకు పట్టుబడ్డా.. వారిపై ఎన్నికేసులున్నా.. కోర్టుల్లో సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయే అవకాశాలే ఎక్కువ. 20 ఏళ్ల క్రితం అతడు ఓ బీజేపీ ఎమ్మెల్యేను దారుణంగా హతమార్చాడు. ఆ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో దూబే విడుదలయ్యాడు. ఐజీ అమితాబ్ ఠాకూర్ గురువారం ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు కూడా దూబేను ఎన్కౌంటర్ చేస్తారనడానికి బలం చేకూరుస్తున్నాయి. ‘‘రేపు వికాస్‌దూబేను అదుపులోకి తీసుకుంటాం. యూపీకి తీసుకొస్తాం. ఆ సమయంలో అతడు తప్పించుకునే ప్రయత్నంలో హతమవ్వొచ్చేమో. అప్పుడు వికాస్ దూబే చరిత్ర పరిసమాప్తి అవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దూబే ఇద్దరు అనుచరులు కార్తికేయ, ప్రవీణ్ అలియాస్ బాహువా దూబే యూపీ పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందారు. బుధవారం హమీర్‌పూర్‌లో అమర్ దూబే, మూడో తేదీన కాన్పూర్‌లో ప్రేమ్ప్రకాశ్ పాండే, అతుల్ దూబేలను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
సమాజ్‌వాదీలోనే నా కొడుకు
నా కొడుకు వికాస్ దూబే సమాజ్ వాదీ పార్టీలో ఉన్నాడు. అతడు బీజేపీ వెంట ఉన్నట్లు 2017లో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ, ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. నా కొడుకును అరెస్టు చేశారు. అతడి విషయంలో ఇప్పుడు ప్రభుత్వానికి ఏది సబబు అనిపిస్తే.. ఆ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. - వికాస్ దూబే తల్లి సరళాదేవి
