రాహుల్‌ మళ్లీ పగ్గాలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-07-12T07:53:56+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని పార్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ లోక్‌సభ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా సమావేశమయ్యారు...

రాహుల్‌ మళ్లీ పగ్గాలు చేపట్టాలి

  • సోనియాతో సమావేశంలో ఎంపీల డిమాండ్‌
  • కొవిడ్‌, గల్వాన్‌లపై చర్చ!

న్యూఢిల్లీ, జూలై 11: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని పార్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ లోక్‌సభ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్‌-19, గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, పెట్రో ధరల పెరుగుదల, రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోదీ సర్కారును ఇరుకునపెట్టేందుకు ఈ అంశాలను లేవనెత్తాలని ఎంపీలకు సోనియా సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం ప్రస్తావనకు వచ్చింది. రాహుల్‌ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ విప్‌ కె.సురేష్‌ మొదట ఈ డిమాండ్‌ను లేవనెత్తగా.. తర్వాత ఎంపీలు ఆయనతో గళం కలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్‌.. మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సురేష్‌ అన్నట్లు సమాచారం.


మోదీ ఎందుకు భయపడుతున్నారు?: రాహుల్‌
‘పీఎం కేర్స్‌’ ఫండ్‌కు విరాళాలిచ్చిన వారి పేర్లను ప్రధాని మోదీ ఎందుకు వెల్లడించడం లేదో తనకు ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. వివరాలు చెప్పేందుకు ఆయన భయపడుతున్నారా అని ప్రశ్నించారు. చైనా కంపెనీలైన షామీ, టిక్‌టాక్‌, ఒన్‌ప్లస్‌ తదితర కంపెనీలు పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చాయన్న విషయం అందరికీ తెలుసని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని ఎంపీలతో జరిగిన సమావేశంలోనూ రాహుల్‌ లేవనెత్తారు. పీఎం కేర్స్‌కు ప్రజలు నిధులు ఇచ్చినందున ఆ నిధులపై ఆడిట్‌, సమీక్ష జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-12T07:53:56+05:30 IST