లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలన్నందుకు.. కత్తితో పోలీసులపై దాడి!
ABN , First Publish Date - 2020-04-08T02:15:35+05:30 IST
కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ సమయంలో కూడా కొందరు ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తచ్చాడుతున్నారు.

భోపాల్: కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ సమయంలో కూడా కొందరు ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తచ్చాడుతున్నారు. ఇటువంటి వారిని అడ్డగించి, ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చేయడం పోలీసుల బాధ్యత. ఇలా తమ బాధ్యత నిర్వర్తిస్తున్న పోలీసులపై కొన్ని మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. మొన్నామధ్య బెంగళూరులో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, తమను అడ్డగించిన మహిళా పోలీసుపై కొందరు యువకులు దాడి చేశారు. ఇప్పుడు తాజాగా లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చిన వారిని అడ్డగించిన పోలీసులను కత్తితో పొడిచేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పాత భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులపై ఈ దాడి జరిగింది. దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ‘మన సంక్షేమం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసులపై దాడి క్షమార్హం కాదు. తప్పుచేసిన ఎవరినీ వదలం’ అని ట్వీట్ చేశారు. నిందితులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు పెడతామని తెలిపారు.