సంచలన నిర్ణయం: 15 కి.మీ పరిధిలో ప్రభుత్వ స్కూళ్లు విలీనం

ABN , First Publish Date - 2020-12-31T04:08:52+05:30 IST

అంతే కాకుండా నూతనంగా నిర్మించనున్న పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు ఉంటాయని, సాంకేతికంగా కూడా అనేక సౌకర్యాలు ఉంటాయని ఇది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు

సంచలన నిర్ణయం: 15 కి.మీ పరిధిలో ప్రభుత్వ స్కూళ్లు విలీనం

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 కిలో మీటర్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయనున్నారు. ‘సీఎం రైస్ స్కూల్ ఇనిషియేటివ్’లో భాగంగా నూతనంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించనున్నారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ పాఠశాలల్లో సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ), ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసిఎస్ఇ) లతో పాటు కేంద్ర విద్యా బోర్డులతో సమానంగా రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు విద్యను అందించడం లక్ష్యంగా ‘సిఎం రైజ్ స్కూల్ ఇనిషియేటివ్’ కార్యక్రమానికి పూనుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రసింగ్ పర్మర్ పేర్కొన్నారు.


ఈ పథకాన్ని రెండు దశల్లో అమలు చేయనున్నారట. మొదటి దశలో 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేస్తారు. ఇందులో 5 ప్రాథమిక పాఠశాలలు సహా 8 మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయట. ఈ పరిధిలో నూతనంగా నిర్మించనున్న పాఠశాలల్లో 1,248 మంది విద్యార్థులు, 25 మంది ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రెండవ దశలో 10 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలను విలీనం చేయనున్నారు. ఇందులో 13 ప్రాథమిక పాఠశాలలు, 3 మాద్యమిక పాఠశాలలను విలీనం చేయనున్నారు. ఈ పరిధిలో నిర్మించే పాఠశాలల్లో 710 మంది విద్యార్థులు, 32 మంది ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.


పాఠశాలలను విలీనం చేయడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదా అవుతుందని విద్యాశాఖ మంత్రి ఇంద్రసింగ్ పర్మార్ అన్నారు. అంతే కాకుండా నూతనంగా నిర్మించనున్న పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు ఉంటాయని, సాంకేతికంగా కూడా అనేక సౌకర్యాలు ఉంటాయని ఇది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో మెరుగైన విద్యను అందించడం నూతన విధానం ద్వారా సాధ్యమవుతుందని ఇంద్రసింగ్ అన్నారు.

Updated Date - 2020-12-31T04:08:52+05:30 IST