ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి న్యాయం చేస్తానని సీఎం హామీ
ABN , First Publish Date - 2020-08-22T11:31:01+05:30 IST
ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి న్యాయం చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు....
భోపాల్ (మధ్యప్రదేశ్): ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి న్యాయం చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. అదనంగా రూ.25లక్షల కట్నం తీసుకురాలేదని బెంగళూరులో నివాసముంటున్న భర్త తన భార్యను ఇంటి నుంచి బయటకు పంపించాడు. దీంతో తన పుట్టిల్లు అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి తిరిగివచ్చిన వివాహితకు భర్త వాట్సాప్ కాల్ చేసి త్రిపుల్ తలాఖ్ ఇస్తున్నట్లు చెప్పాడు. భోపాల్ నగరానికి చెందిన ముస్లిమ్ మహిళ (42)కు 2001లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో ఉద్యోగం లభించడంతో వారి కుటుంబం 2013లో భోపాల్ నుంచి బెంగళూరుకు మారింది. అదనపు కట్నం తీసుకురమ్మని తన భర్త వేధించడంతోపాటు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టి, ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని బాధిత వివాహిత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ మహిళకు న్యాయం చేయాలని డీజీపీని ఆదేశించారు.