డబ్ల్యూహెచ్‌వోపై ఆస్ట్రేలియా ప్రధాని తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2020-04-15T00:14:15+05:30 IST

చైనాలో వెట్ మార్కెట్లు (మాంసం దుకాణాలు) తెరిచేందుకు మద్దతిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్...

డబ్ల్యూహెచ్‌వోపై ఆస్ట్రేలియా ప్రధాని తీవ్ర ఆగ్రహం

మెల్‌బోర్న్: చైనాలో వెట్ మార్కెట్లు (మాంసం దుకాణాలు) తెరిచేందుకు మద్దతిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలోని ఓ ప్రముఖ వెట్ మార్కెట్ నుంచి ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకొచ్చిందని భావిస్తున్న తరుణంలో... వీటిని మళ్లీ తెరిచేందుకు డబ్ల్యూహెచ్‌వో ఎలా మద్దతు ఇచ్చిందో అర్థంకావడంలేదని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ చైనా నగరం వుహాన్‌లో ఓ వెట్ మార్కెట్ నుంచి గతేడాది డిసెంబర్లో కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిందనీ.. జంతువుల నుంచి అది మనుషులకు సోకిందనీ సర్వత్రా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఓ స్థానిక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ నిర్ణయంపై నేను తీవ్ర గందరగోళానికి గురయ్యాను. ఇలాంటి వైరస్‌లు పుట్టుకొచ్చేందుకు మూల కారణమైన ప్రదేశాల నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది..’’ అని పేర్కొన్నారు. ఇలాంటి మహమ్మారిపై పాఠాలు నేర్చుకునేందుకు ఆస్ట్రేలియా సహా ప్రపంచ దేశాలన్నీ డబ్ల్యూహెచ్‌వో వంటి అంతర్జాతీయ సంస్థల వైపు చూస్తాయని ఆయన గుర్తుచేశారు.


‘‘వుహాన్‌లో ఈ వైరస్ ఎలా పుట్టింది.. ఎలా వ్యాప్తి చెందింది అనేది అర్థం చేసుకునేందుకు పాదర్శకత చాలా అవసరం. ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి ప్రమాదంగా పరిణమించిన వెట్ మార్కెట్ల గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి...’’ అని మోరిసన్ పేర్కొన్నారు.  కాగా వెట్ మార్కెట్లు తెరుస్తూ చైనా తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ సైతం వ్యాఖ్యానించారు. వ్యాధికారకాలైన ఆహార మార్కెట్లపై నిషేధం విధించాలంటూ ప్రపంచ దేశాలు చైనాను కోరుతున్నప్పటికీ... డబ్ల్యూహెచ్‌వో మాత్రం అందుకు సమ్మతించడం లేదు. ఆహారం అందించడంలో వెట్ మార్కెట్ల పాత్ర కీలకమనీ.. వాటిని కొనసాగించాల్సిందేనని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది. అయితే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే రిస్క్‌ను తగ్గించేందుకు మార్కెట్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఒకరు ఎస్‌బీఎస్ న్యూస్‌తో పేర్కొన్నారు. కాగా ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 6400 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-04-15T00:14:15+05:30 IST