20 వేలు దాటిన మరణాలు
ABN , First Publish Date - 2020-07-08T07:19:18+05:30 IST
కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలోనే.. దేశంలో కరోనా మరణాలు 20 వేలు దాటాయి. కేవలం 37 రోజుల్లోనే దాదాపు 15 వేల మంది వైర్‌సతో ప్రాణాలు కోల్పోయారు...
- జూన్ నుంచే 15 వేల మంది మృతి!
- మూడ్రోజులుగా అమెరికా కంటే ఎక్కువ
న్యూఢిల్లీ, జూలై 7: కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలోనే.. దేశంలో కరోనా మరణాలు 20 వేలు దాటాయి. కేవలం 37 రోజుల్లోనే దాదాపు 15 వేల మంది వైర్‌సతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 1 నాటికి 5,600గా ఉన్న మరణాలు.. మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 20,160కి చేరాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 22,252 మందికి వైరస్ సోకినట్లు కేంద్రం తెలిపింది. కాగా, గత మూడు రోజులుగా అమెరికాలో కంటే భారత్‌లోనే కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో కేసులు మాత్రం అగ్ర రాజ్యంలో కంటే సగమే నమోదవుతున్నాయి. మరోవైపు ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య దేశంలో 1.34 లక్షల కేసులు నమోదవగా, 2,760 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల్లో 16 వేలపైగా మహారాష్ట్ర (9,026), తమిళనాడు (1,571), ఢిల్లీ (3,115), గుజరాత్ (1,960), ఉత్తరప్రదేశ్‌లో (809)లోనే సంభవించాయి. మంగళవారం రికవరీ రేటు 61.13 శాతానికి చేరిందని కేంద్రం పేర్కొంది. అత్యధికంగా 15,515 మంది కోలుకున్నారు. ప్రతి పది లక్షల జనాభాకు కేసులు, మరణాలు భారత్‌లోనే తక్కువని కేంద్రం తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదికను ఉటంకిస్తూ.. మన దేశంలో పది లక్షల జనాభాకు మరణాల రేటు 14.27 అని, ప్రపంచ రేటు 68.29గా తెలిపింది. ఢిల్లీలో కొవిడ్ నుంచి కోలుకున్న పోలీసులు ప్లాస్మా దానానికి ముందుకొచ్చారు. ఒడిసాలో కేసులు పది వేలు దాటాయి. రాష్ట్రంలోని బాలాసోర్ నియోజకవర్గ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి హోం క్వారంటైన్‌కు వెళ్లారు. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అధికారిక నివాసంలో ఉంటున్న ఆయన మేనకోడలికి పాజిటివ్ వచ్చింది. వైరస్ జన్మస్థానమైన చైనాను దేశ ఆర్థిక రాజధాని ముంబై మించిపోయింది. చైనాలో ఇప్పటివరకు 4,600 మంది మరణించగా, 83 వేల కేసులు నమోదయ్యాయి. కానీ, మార్చి రెండో వారంలో కరోనా తొలి కేసు నమోదైన ముంబైలో రెండున్నర నెలల తర్వాత.. మంగళవారం నాటికి 4,938 మంది మృతి చెందారు. 85,724 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే 1498 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 26,815కు చేరుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 416కి చేరింది.
49 రోజుల్లో 6 లక్షల కేసులు
భారత్‌లో శరవేగంగా కొవిడ్ వ్యాప్తి
దేశంలో కొవిడ్-19 శరవేగంగా వ్యాపిస్తోంది. తొలి లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజులు పట్టగా.. ఆ తర్వాత 49 రోజుల్లోనే కేసుల సంఖ్య 7 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం. తొలి కేసు కేరళలో జనవరి 30న నమోదు కాగా.. మే 19 నాటికి లక్ష కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పదిహేను రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. లక్ష నుంచి 5 లక్షలకు చేరడానికి 39 రోజులు పట్టగా.. ఏడు లక్షలకు చేరడానికి 49 రోజులు పట్టింది. అంటే గత పది రోజుల్లోనే రెండు లక్షల కేసులు నమోదైనట్టు! అయితే, వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 61.13 శాతంగా ఉండడం.. యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం, మరణాల రేటు తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయం. కాగా, కరోనా మరణాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడోస్థానంలో నిలిచింది. దేశంలో ప్రతి పదిలక్షల మంది జనాభాకుగాను.. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నవారి (యాక్టివ్ కేసుల) కంటే, వైరస్ బారిన పడి కోలుకున్నవారి (రికవరీ కేసుల) సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మిలియన్ జనాభాకు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 186.3గా ఉండగా.. రికవరీ కేసుల సంఖ్య 315.8గా ఉందని వెల్లడించింది.