దేశంలో 8 లక్షలకు చేరువైన కరోనా కేసులు.. మరిన్ని లాక్‌డౌన్‌లు!

ABN , First Publish Date - 2020-07-10T21:28:25+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. నిన్న 25 వేలకు పైగా కేసులు

దేశంలో 8 లక్షలకు చేరువైన కరోనా కేసులు.. మరిన్ని లాక్‌డౌన్‌లు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. నిన్న 25 వేలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా, గత 24 గంటల్లో 26,500 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైంది. అలాగే, మరణాల సంఖ్య 21 వేల మైలు రాయిని చేరుకుంది. 


దేశంలోని మొత్తం కేసులలో 60 శాతం మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదవుతుండడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ, ఇటీవల వరుస సడలింపులతో దేశీయ విమాన సర్వీసులు, ప్రత్యేక రైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు వంటివి తెరుచుకున్నాయి. పలు కార్యాలయాలు కూడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి.


సడలింపుల తర్వాత కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక పట్టణమైన ఔరంగాబాద్‌లో 9 రోజులపాటు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బజాజ్ ఆటో వంటి వాహన తయారీ సంస్థలపై పెను ప్రభావం చూపుతోంది. అలాగే, స్కోడా ఆటో ఫోక్స్‌వేగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వాహన విడిభాగాలు తయారు చేసే చిన్న పరిశ్రమలు, అజంతా ఫార్మా వంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలతోపాటు కార్ల్స్‌బెర్గ్, హీనెకెన్ వంటి బీరు తయారీ కంపెనీలపై ప్రభావం చూపనుంది. 


అలాగే, నేటి నుంచి రెండు రోజులపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిన్నటి నుంచే లాక్‌డౌన్ ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నాయి.


Updated Date - 2020-07-10T21:28:25+05:30 IST