పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-09-14T16:47:42+05:30 IST
పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం ప్రకటించింది. దేశానికి ప్రణబ్ చేసిన సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా... ఆ పదవికి ప్రణబ్ హుందాతనం తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఇటీవలే మృతి చెందిన ఎంపీలకు కూడా సభ సంతాపం ప్రకటించింది. దీంతో పాటు కరోనా యోధులకు కూడా పార్లమెంట్ నివాళులర్పించింది. దీని తర్వాత గంటసేపు వాయిదా పడింది.
కోవిడ్ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ‘కోవిడ్ నెగెటివ్’ అని తేలిన వారికే సభలోకి అనుమతిస్తున్నారు. మాస్క్ ధరించాలన్న నిబంధనను మాత్రం కచ్చితం చేశారు అధికారులు. కోవిడ్ నేపథ్యంలో ఉభయ సభల సమయం కూడా మారిపోయింది. రాజ్యసభ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగనుంది.
మరోవైపు కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరి క్వశ్చన్ అవర్ గురించి సభలో లేవదీశారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏమాత్రం ప్రజాస్వామ్యం కాదని స్పష్టం చేశారు. ‘‘ప్రశ్నోత్తరాల సమయం సభకు గుండెకాయ వంటిది. అలాంటి దానిని ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రజాస్వామ్య గొంతును మీరు నొక్కేస్తున్నారు’’ అంటూ కేంద్రంపై అధీర్ మండిపడ్డారు.