మోదీ-ట్రంప్ ఫోన్ సంభాషణలో.. యోగా, ఆయుర్వేదంపై చర్చ..

ABN , First Publish Date - 2020-04-05T18:42:29+05:30 IST

కరోనా కల్లోలం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు. రోజు రోజుకూ విజృంభిస్తున్న

మోదీ-ట్రంప్ ఫోన్ సంభాషణలో.. యోగా, ఆయుర్వేదంపై చర్చ..

వాషింగ్టన్: కరోనా కల్లోలం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు. రోజు రోజుకూ విజృంభిస్తున్న కొవిడ్-19ను నిలువరించేందుకు ఇరువురి మధ్య సుదీర్ఘ మంతనాలు జరిగాయి. అయితే ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో శారీరక, మానసిక ప్రశాంతత కోసం యోగా, ఆయుర్వేదం ఎలా పని చేస్తుందనే విషయాలను ట్రంప్.. మోదీని అడిగి తెలుసుకున్నారని.. వైట్‌హౌస్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.


అమెరికాలో ఇప్పటివరకూ 3 లక్షల 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 8,400 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారత్‌లో 3,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 75 మంది ఈ వైరస్ సోకి కన్నుమూశారు. 


ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదురుకోవాలనే విషయంపై ఇరు దేశాల నేతలు చర్చించుకున్నారని.. వైట్‌హౌస్ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీలు, మందుల విక్రయదారులతో తరచూ సంప్రదింపులు జరపాలని వాళ్లు అనుకున్నారని తెలిపింది.


‘‘వీటిలో పాటు యోగా మరియు ఆయుర్వేదం ప్రాముఖ్యత గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆ రెండు మానసిక, శారీరక ప్రశాంతత కల్పించడంలో ఏ మేరకు తోడ్పతాయో వాళ్లు చర్చించుకున్నారు’’ అని వైట్‌హౌస్ ప్రకటనలో స్పష్టం చేసింది. 


ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్-19పై పోరుకు భారత్-అమెరికా సాయశక్తులా కృషి చేస్తాయంటూ ఆయన ట్వీట్ చేశారు.

Updated Date - 2020-04-05T18:42:29+05:30 IST