దేశరక్షణలో గత ప్రభుత్వాలు రాజీ
ABN , First Publish Date - 2020-10-04T07:42:12+05:30 IST
దేశరక్షణ విషయంలో గత ప్రభుత్వాలు రాజీపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సైన్యానికి అవసరమైన ఫైటర్ జెట్లు, అధునాతన ఆయుధాలు, వ్యూహాత్మక సాధన సంపత్తిని సమకూర్చడంలో గత సర్కార్లు విఫలమయ్యాని ఆరోపించారు...
- వ్యవసాయ సంస్కరణలు చేసే ధైర్యమూ లేదు
- వాటి దృష్టంతా ఓట్ల రాజకీయాలపైనే: మోదీ
- అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని
రోహ్‌తగ్/శిస్సు/ సొలాంగ్ వ్యాలీ(హిమాచల్‌ప్రదేశ్), అక్టోబరు 3: దేశరక్షణ విషయంలో గత ప్రభుత్వాలు రాజీపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సైన్యానికి అవసరమైన ఫైటర్ జెట్లు, అధునాతన ఆయుధాలు, వ్యూహాత్మక సాధన సంపత్తిని సమకూర్చడంలో గత సర్కార్లు విఫలమయ్యాని ఆరోపించారు. దేశ రక్షణకు మించిన ప్రాధాన్యం తమ ప్రభుత్వానికి ఏదీలేదని ఆయన స్పష్టంచేశారు. ‘‘అధునాతనమైన యుద్ధవిమానం కావాలని ఎయిర్‌ఫోర్సు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తునే ఉంది. అయితే వాళ్లు (అప్పుడు అధికారంలో ఉన్నవారు) ఫైళ్లు తెరిచారు. మూసేశారు. ఫైళ్లతోనే ఆడుకున్నారు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ప్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి యూపీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో జరిగిన జాప్యాన్ని ప్రభుత్వం తరచూ వేలెత్తిచూపుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యమున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ సొరంగ మార్గాన్ని హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరునెలల తర్వాత ప్రధాని బహిరంగ సభలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టులు ఆలస్యం కావడానికిగల ‘‘ఒత్తిళ్లు’’ ఏమిటని కాంగ్రెస్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ప్రశ్నించారు. సొలాంగ్ వ్యాలీలో జరిగిన మరో సభలో మాట్లాడిన ప్రధాని.. వ్యవసాయ, కార్మిక చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలను తప్పుపట్టారు.
‘‘వ్యవసాయ, కార్మికరంగంలో సంస్కరణలు చేపట్టాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటిని అమలుచేయడానికి ఆపార్టీలకు ధైర్యం చాలలేదు. మా ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకుంది’’ అని మోదీ అన్నారు. వ్యూహాత్మకంగా సొరంగం ప్రాధాన్యతను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సొరంగం నిర్మాణానికి 8,500 టన్నులకుపైగా టీఎంటీ ఉక్కు ను సరఫరా చేశామని విశాఖపట్టణంలోని ఆర్‌ఐఎన్‌ఎల్ (రాష్ర్టీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్) వెల్లడించింది.