తొందర్లో అందరికీ టీకా

ABN , First Publish Date - 2020-08-16T07:23:38+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి తన ప్రసంగంలో దేశాన్ని కలవరపెడుతున్న రెండు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు...

తొందర్లో అందరికీ టీకా

 • కొవిడ్‌కు మూడు వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి
 • రుషులు, యోగుల్లా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు
 • దేశ ప్రజలందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు
 • జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌కు శ్రీకారం
 • పౌరుడి సమస్త ఆరోగ్య సమాచారం ఐడీలోనే
 • డీలిమిటేషన్‌ పూర్తి కాగానే కశ్మీరుకు ఎన్నికలు
 • అయోధ్యపై ప్రజల సంయమనం అపూర్వం
 • మహిళల వివాహ వయస్సుపై పునస్సమీక్ష
 • సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా!
 • కన్నేసేవారికి అర్థమయ్యే భాషలో బుద్దిచెప్పాం..
 • పాక్‌ ఉగ్ర, చైనా విస్తరణవాదాన్ని సహించం
 • మనమేంటో లద్దాఖ్‌లో ప్రపంచానికి తెలిసింది
 • సైన్యం వీరత్వానికి ఎర్రకోట పైనుంచి శాల్యూట్‌
 • ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం


న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రధాని నరేంద్ర మోదీ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి తన ప్రసంగంలో దేశాన్ని కలవరపెడుతున్న రెండు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన చైనాకు మన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. కరోనా వైర్‌సను అంతం చేసే వ్యాక్సిన్‌ను సిద్ధం చేసేందుకు మన శాస్త్రవేత్తలు... రుషులు, యోగుల తరహాలో నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారని చెప్పారు. ఏటా వేల మంది చిన్నారులతో కనుల పండువగా జరిగే ఈ కార్యక్రమం కరోనా నేపథ్యంలో ఈసారి మంత్రులు, దౌత్యవేత్తలు, అధికారులు సహా కేవలం 4వేల మంది ప్రతినిధులతో ఎలాంటి అట్టహాసం లేకుండా కొనసాగింది. 69 ఏళ్ల నరేంద్ర మోడీ దాదాపు గంటన్నర పాటు ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు.


ఎల్వోసీ నుంచి అయినా(పాకిస్థాన్‌) ఎల్‌ఏసీ నుంచి అయినా(చైనా) భారత సార్వభౌమాధికారంపై ఎవరు కన్నేసినా భారత సైన్యం వారికి అర్థమయ్యే భాషలో బదులిస్తుందన్నారు. ఉగ్రవాదానికి, విస్తరణవాదానికి వ్యతిరేకంగా భారత్‌ దృఢ సంకల్పంతో పోరాడుతుందని ప్రకటించారు. లద్దాఖ్‌లో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సహసాలతోపాటు సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి భారతదేశం ఎంత వరకైనా వెళ్లగలదనే విషయాన్ని ప్రపంచమంతా గమనించిందని చెప్పారు. మాతృభూమి కోసం గల్వాన్‌ లోయలో ప్రాణాలర్పించిన సాహస వీరులకు ఎర్రకోట సాక్షిగా శాల్యూట్‌ చేస్తున్నానన్నారు.


డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. దాంతో ప్రజలకు వైద్య సేవలు మరింత తేలిక అవుతాయన్నారు. ఆరోగ్య ఐడీలో ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేస్తామని ప్రకటించారు. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు, వైద్య పరీక్షల నివేదికలు, గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నివేదికలు అన్నీ అందులోనే ఉంటాయని వివరించారు. ఈ మిషన్‌తో వైద్యరంగంలో సామర్థ్యం పెరగడమే కాకుండా పారదర్శకత ఏర్పడుతుందని చెప్పారు. 


దేశ ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సిద్ధం కాగానే సాధ్యమైనంత త్వరగా దేశ ప్రజలందరికీ అందే విధంగా ప్రణాళిక రూపొందించామని ప్రధాని వెల్లడించారు. శాస్త్రవేత్తలు అనుమతి ఇవ్వగానే ఒకేసారి పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తి పంపిణీని చేపడతామన్నారు. ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్సు వివిధ దశల ప్రయోగ పరీక్షల్లో ఉన్నట్లు చెప్పారు. ప్రధాని చెప్పిన మూడు వ్యాక్సిన్లలో రెండింటిని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌, జైడస్‌ కాడిలాలతో కలిసి దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు వ్యాక్సిన్లకు సంబంధించి మానవులపై మొదటి రెండు దశల ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. మూడో వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందించింది. కరోనా వైర్‌సపై భారత్‌ విజయం సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో స్వయం స్వావలంబలన అవసరమన్న పెద్ద పాఠం నేర్చుకున్నామని.. ఇప్పటివరకు దృష్టి పెట్టని పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, వెంటిలేటర్లు ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నామని ప్రస్తావించారు. ఐదేళ్లలో 45 వేల ఎంబీబీఎస్‌, ఎండీ సీట్లు కొత్తగా వచ్చాయని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తలపెట్టిన లక్షన్నర వెల్‌నెస్‌ సెంటర్లలో మూడోవంతు ఇప్పటికే పని చేస్తున్నాయని, కొవిడ్‌ కష్టకాలంలో అవి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. 


కశ్మీరు- అయోధ్య

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తికాగానే జమ్మూ కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏడాది క్రితం 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరిగాయన్నారు. శతాబ్దాల వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించామని చెప్పారు. అయోధ్య విషయంలో దేశ ప్రజలు తెలివిగా, సంయమనంతో వ్యవహరించిన తీరు అపూర్వమని, భావితరాలకు స్ఫూర్తిదాయమని అన్నారు. 


విద్యావిధానం

భారత్‌ స్వయం స్వావలంబన సాధించి, సంపన్నవంతం కావడం లక్ష్యంగా కొత్త జాతీయ విద్యావిధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పరిశోధన వినూత్న ఆలోచనను బలోపేతం చేసి, పోటీ ప్రపంచంలో భారత్‌ ప్రగతి సాధించేందుకు కొత్త విద్యా విధానం సహాయ పడుతుందని చెప్పారు.


ఏమిటీ హెల్త్‌కార్డు?

జన్మించినప్పటి నుంచీ ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్నంతా డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేయడమే హెల్త్‌కార్డు. ప్రతి కార్డుకు 14 అంకెల డిజిటల్‌ సీరియల్‌ నెంబరు ఇస్తారు. దీనినే హెల్త్‌ ఐడీగా పిలుస్తారు. మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ కార్డును వినియోగించవచ్చు. పాస్‌వర్డ్‌ రక్షణ కూడా ఉంటుంది. ఏ వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నా, ఎక్కడ మందుల దుకాణంలో కొనుగోలు చేసినా స్వయంచాలితంగా కార్డులోకి ఆ సమాచారం చేరిపోతుంది. రోగి అనుమతితో ఒకసారి పనిచేసే(వన్‌టైం) పాస్‌వర్డ్‌ ద్వారా పరిమిత సమయం మాత్రమే వైద్యులు సదరు సమాచారాన్ని చూడగలుగుతారు. ఆధార్‌ కార్డుతో హెల్త్‌కార్డును అనుసంధానం చేసే అవకాశం ఉందని కేంద్ర సహాయ మంత్రి అశ్వనీ కుమార్‌ తెలిపారు. 


ప్రత్యేక ఆకర్షణగా మోదీ ఆహార్యం

ఈసారి కూడా  ప్రధాని నరేంద్రమోదీ ఆహార్యం ప్రత్యేకంగా నిలిచింది. కషాయం, క్రీమ్‌ రంగుతో ఉన్న తలపాగాతో ప్రధాని వేదిక మీదకు వచ్చారు. ‘సాఫా’  సంప్రదాయంలో భాగంగా ఆయన పొట్టి చేతుల కుర్తా, శరీరానికి అతుక్కుపోయే చుడిదారినిఽ వేసుకున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని కాషాయం రంగు అంచున్న తెల్లటి స్కార్ఫ్‌ ను ముఖానికి కట్టుకున్నారు.  


‘ఎన్‌సీసీ’కి సైనిక శిక్షణ

ఎన్‌సీసీ కేడెట్లకు సైనిక శిక్షణనిచ్చి దేశ సరిహద్దుల్లో, తీరప్రాంతాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ దిశగా నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ)ని మరింతగా విస్తరిస్తామని తెలిపారు. లక్ష మంది కొత్త కేడెట్లను తీసుకుని, వారికి తగిన శిక్షణనిప్పిస్తామని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ, తీరప్రాంతాల్లో నేవీ, ఎయిర్‌బేస్‌ ఉన్న ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్‌ ద్వారా శిక్షణనిప్పిస్తామని, దేశ సేవలో విద్యార్థులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు వీరి సేవలను వినియోగించుకుంటామన్నారు.


ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌

దేశంలోని మొత్తం ఆరు లక్షల గ్రామాలకు వెయ్యి రోజుల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని మోదీ ప్రకటించారు. లక్షద్వీప్‌కు కూడా సముద్ర గర్భంనుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేస్తామని చెప్పారు. తాను ప్రధాని అనాటికి 60 గ్రామా లకే ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నె ట్‌ అందుతోందని, గత ఐదేళ్లలో లక్షన్నర గ్రా మాలకు అందించామన్నారు. సైబర్‌ భద్రత కోసం కొత్త విధానం త్వరలో ప్రకటించనున్నామని చెప్పారు. మహిళల వివాహానికి కనీస వయస్సు నిర్ణయించేందుకు కమిటీని వేసినట్లు తెలిపారు. జన ఔషధి కేంద్రాల్లో రూపాయికే శానిటరీ నాప్‌కిన్‌ ఇస్తున్నట్లు చెప్పారు.  ఉపాధి అవకాశాల్లో మహిళలకు సమాన వాటా ఇచ్చే దిశగా ప్రభుత్వం కదులుతోందన్నారు. 


వ్యవసాయం

దేశంలోని రైతులకు సంకెళ్లు వేసిన మార్కెటింగ్‌ విధానానికి స్వస్తి చెప్పామని, బట్టలు, సబ్బుల్లాగే పంటలు కూడా ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛ కల్పించామన్నారు. డీజిల్‌ పంపుసెట్ల నుంచి సోలార్‌ పంపుసెట్లకు మారడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించా రు. 192 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశం సీటు కోసం జరిగిన ఎన్నికల్లో 184 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఓటేసినట్లు ప్రధాని చెప్పారు.దేశవిదేశాల్లో ఘనంగా.. 

దేశరాజధాని న్యూఢిల్లీలో శనివారం జరిగిన స్వాతంత్య్రదినోత్స వేడుకలకు ఎస్‌ఎన్జీ స్నైపర్లు, శ్వాట్‌ కమెండోల పహారాలో ఎర్రకోట పరిసర ప్రాంతాలు శత్రుదుర్బేధ్యంగా మారాయి. సుమారు 300 కెమెరాలను ఏర్పాటుచేశారు.  శ్రీనగర్‌లో  పటిష్ఠమైన భద్రతల నడుమ జెండావందన కార్యక్రమం జరిగింది. మరోవైపు, దేశవిదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా శనివారం స్వాతంత్య్రదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.జెండావందనం చేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయగీతాలను, దేశభక్తి గీతాలను ఆలపించారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సింగపూర్‌, చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, యూఏఈ, ఇజ్రాయిల్‌, ఇతర దేశాల్లోని  దౌత్యకార్యాలయాల్లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరిగాయి.  విదేశాల ప్రముఖులు పలువురు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.  

మోదీ భద్రతకు మహిళా సైనికాధికారి 

జెండావందనం సమయంలో ప్రధాని మోదీకి భద్రతగా, సహాయకురాలిగా తొలిసారి మహిళా సైనికాధికారిని నియమించారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేటప్పుడు మోదీకి మేజర్‌ శ్వేతాపాండే భద్రత కల్పించారు. జెండా ఎగరేసేటప్పుడు ప్రధానికి సాయం చేశారు. లఖ్‌నవూకు చెందిన శ్వేతాపాండే 2012 మార్చిలో సైన్యంలో చేరారు. చెన్నైలోని సైనిక అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.    శ్వేతాపాండే తండ్రి రాజ్‌రతన్‌ పాండే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్‌గా పనిచేశారు. తల్లి అమితా పాండే హిందీ, సంస్కృత భాషల్లో ప్రొఫెసర్‌.యాంటీడ్రోన్‌ సిస్టమ్‌...

ఎర్రకోటపై ఏర్పాటుచేసిన యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని డీఆర్‌డీవో అభివృద్ధిచేసింది.  ఈ డ్రోన్‌ వ్యవస్థ కు దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో నిఘా పెట్టే సామర్థ్యం ఉంటుంది.  అతి చిన్న పరిమాణంలోని డ్రోన్లను కూడా పసిగట్టి నిలిపివేసే సామర్థ్యం దీని సొంతం. 

Updated Date - 2020-08-16T07:23:38+05:30 IST