మిజోరాంకి అభయహస్తం ఇచ్చిన మోదీ

ABN , First Publish Date - 2020-06-23T01:07:08+05:30 IST

వరుస భూకంపాలతో విలవిల్లాడుతున్న మిజోరాంకి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ..

మిజోరాంకి అభయహస్తం ఇచ్చిన మోదీ

న్యూఢిల్లీ: వరుస భూకంపాలతో విలవిల్లాడుతున్న మిజోరాంకి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఈ రాష్ట్రం రెండు సార్లు ఓ మోస్తరు తీవ్రతతో కూడిన భూకంపాలను చవిచూసిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. హోంమంత్రి అమిత్ షా సైతం ఇవాళ స్వయంగా సమీక్షించారు. ‘‘మిజోరాంలో భూకంపం నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై ముఖ్యమంత్రి  జోరాంథంగాతో మాట్లాడాను. కేంద్రం నుంచి సాధ్యమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చాను..’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమిత్ షా స్పందిస్తూ.. ‘‘మిజోరాం సీఎం జోరాంథంగాతో నేను మాట్లాడాను. రాష్ట్రంలో సంభవించిన భూ ప్రకంపనలపై పరిస్థితిని సమీక్షించాను. కేంద్రం తరపున సాధ్యమైన సహకారం అందిస్తామని చెప్పాను. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను...’’ అని ట్వీట్ చేశారు.


ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో వరుసగా రెండో రోజు సంభవించిన భూకంపం స్థానికులను వణికించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 4.10కి భూమి కంపించగా.. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీనికి సరిగ్గా 12 గంటల క్రితమే రాష్ట్రంలో 5.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ నెల 18న 5.0 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గత రెండు నెలలుగా దేశంలోని పలు ప్రాంతాలను స్వల్ప భూకంపాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే. గత వారంరోజుల్లోనే దేశంలో 20 భూకంపాలు చోటుచేసుకున్నట్టు జాతీయ సీస్మాలజీ కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి.Updated Date - 2020-06-23T01:07:08+05:30 IST