దేశాన్ని ముందుండి నడిపిస్తున్న మోదీ: బీజేపీ

ABN , First Publish Date - 2020-05-13T07:29:17+05:30 IST

కరోనా సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందుండి నడిపిస్తున్నారని బీజేపీ కొనియాడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని పేర్కొంది. రూ.20 లక్షల కోట్లతో దేశ జీడీపీలో 10 శాతం ప్యాకేజీని ప్రకటించడం...

దేశాన్ని ముందుండి నడిపిస్తున్న మోదీ: బీజేపీ

న్యూఢిల్లీ, మే 12: కరోనా సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందుండి నడిపిస్తున్నారని బీజేపీ కొనియాడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని పేర్కొంది. రూ.20 లక్షల కోట్లతో దేశ జీడీపీలో 10 శాతం ప్యాకేజీని ప్రకటించడం ద్వారా భారత స్వావలంబనను చాటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దీంతో సమాజంలోని ప్రతి వర్గానికీ లబ్ధి చేకూరుతుందన్నారు. కాగా, దేశానికి ప్రధాని మోదీ సరికొత్త అభివృద్ధి పథాన్ని చూపారని ఆ పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు.  ఈ ప్యాకేజీ ద్వారా చిన్న పరిశ్రమల ఆకాంక్షలను ప్రధాని నెరవేర్చారని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కొనియాడారు. మరోవైపు భారత ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్విటర్‌లో పేర్కొన్నారు.


స్థానిక పరిశ్రమలకు ఊతం: ఆనంద్‌ మహీంద్రా
మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామిక వర్గాలు ఆహ్వానించాయి. ఈ ప్యాకేజీతో స్థానిక పరిశ్రమలకు ఊతం లభిస్తుందని పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాని శక్తివంతమైన ఊపునిచ్చారని ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా కొనియాడారు.

Read more