జాతికి ప్రధాని సంజాయిషీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-06-18T07:06:48+05:30 IST

వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంలోకి చైనా సేనలు ఎలా చొచ్చుకొచ్చాయో ప్రధాని మోదీ దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు...

జాతికి ప్రధాని సంజాయిషీ ఇవ్వాలి

  • చైనా ఆక్రమణపై వాస్తవాలు చెప్పాలి: సోనియా, రాహుల్‌


న్యూఢిల్లీ, జూన్‌ 17: వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంలోకి చైనా సేనలు ఎలా చొచ్చుకొచ్చాయో ప్రధాని మోదీ దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. లద్దాఖ్‌లో భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా సేనల చేతిలో 20 మంది భారత సైనికులు వీరమరణం ఎందుకు పొందాల్సి వచ్చిందో ప్రధాని సంజాయిషీ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. బుధవారం ఆమె వీడియో సందేశం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని సోనియా చెప్పారు. సరిహద్దుల్లో జరిగిన ఈ ఘర్షణల్లో భారత సైనికుల ఆచూకీ ఇంకా తెలియకుండా ఉన్నదా? తీవ్రంగా గాయపడిన సైనికులు ఇంకా ఎంతమంది ఉన్నారో వెల్లడించాలని  ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లద్దాఖ్‌ వద్ద పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ఆలోచన, వ్యూహమేంటో వెల్లడించాలని ఆమె కోరారు. 


ప్రధాని మోదీ ముఖం చాటేయడం మాని ప్రజల ముందుకొచ్చి భారత-చైనా ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. చైనా సరిహద్దుల్లో ఏం జరిగింది? మోదీ ఎందుకు మౌనం దాల్చారో  ప్రజలు తెలుసుకోగోరుతున్నారని రాహుల్‌ అన్నారు. కాగా, 20 మంది భారత సైనికుల వీరమరణానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. మోదీ సర్కారు దౌత్యపరంగా హ్రస్వ దృష్టి వల్లనే లద్దాఖ్‌లో భారత సైనికులు బలయ్యారని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా నిఘా వైఫల్యమేనని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు వ్యాఖ్యానించారు. హింసకు తెగబడిన చైనాకు భారత్‌ గుణపాఠం చెప్పాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-06-18T07:06:48+05:30 IST