సిక్కులతో అనుబంధంపై ఈ-మెయిల్స్ పంపుతున్న మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-13T19:24:53+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు

సిక్కులతో అనుబంధంపై ఈ-మెయిల్స్ పంపుతున్న మోదీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి సిక్కులతో ఉన్న అనుబంధాన్ని కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ద్వారా 47 పేజీల పుస్తకాన్ని ఈ-మెయిల్ ద్వారా సిక్కులకు పంపిస్తోంది. ‘పీఎం మోదీ, ఆయన ప్రభుత్వానికి సిక్కులతో గల ప్రత్యేక అనుబంధం’ శీర్షికతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఇది ఇంగ్లిష్, హిందీ, పంజాబీ భాషల్లో ఉంది. ప్రధాని మోదీకి ప్రదానం చేసిన కవామీ సేవా పురస్కారంలోని కొన్ని పంక్తులను ప్రస్తావించారు. 


ఐఆర్‌సీటీసీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ, ఈ బుక్‌లెట్‌ను కొద్ది రోజుల క్రితమే విడుదల చేసినట్లు తెలిపారు. దీనిని అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు పంపిస్తున్నాయన్నారు. పంజాబ్ ప్రాంతంలోని ‘సింగ్’ ఇంటిపేరుగల వ్యక్తులకు పంపిస్తున్నట్లు తెలిపారు. 


రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం కోసం ప్రయాణికులు ఇచ్చిన ఈ-మెయిల్ ఐడీలను ఈ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించిన  ఈ పుస్తకంలో 13 శీర్షికలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం సిక్కుల కోసం చేసిన కృషిని దీనిలో వివరించారు. 



Updated Date - 2020-12-13T19:24:53+05:30 IST