ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచరాదు

ABN , First Publish Date - 2020-03-19T10:36:48+05:30 IST

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు బుధవారంనాడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచరాదు

  • వారు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలగాలి
  • మధ్యప్రదేశ్‌ పరిణామాలపై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, మార్చి 18: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు  బుధవారంనాడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు 16 మందిని న్యాయమూర్తుల చాంబర్‌లో హాజరుపరుస్తామన్న ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. వారిని కలిసేందుకు కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను పంపడానికీ నిరాకరించింది. అదే సమయంలో.. ‘ఎమ్మెల్యేలను బందీలుగా మాత్రం ఉంచరాదు. ప్రస్తుతం ఆ 16 మందినీ బందీలుగా ఉంచారని మేం అనడం లేదు. అలా అంటే కేసును ముందే తేల్చేసినట్లే. దీనిపై ఉన్న అపోహలు పోగొట్టడమే మా ఉద్దేశం’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఇక్కడ విషయమేంటంటే... 16 మంది ఎమ్మెల్యేల సంగతిని(అంటే రాజీనామాలు ఆమోదించినదీ లేనిదీ) స్పీకర్‌ తేల్చలేదు. వారేమో బెంగళూరు వెళ్లిపోయారు. వారు వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని, అప్పుడే రాజీనామాల ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ చెబుతున్నారు. మీరు తప్పనిసరిగా అసెంబ్లీకి వచ్చి ప్రొసీడింగ్స్‌లో పాల్గొనండి అని మేం వారిపై ఒత్తిడి తేలేం. మేం చేయగలిగిందల్లా వారు స్వేచ్ఛగా తమ నిర్ణయం తీసుకోగలిగేట్లు చేయడం’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు. తమనెవరూ కిడ్నాప్‌ చేయలేదని, తమంత తాముగా బెంగళూరు వెళ్లామని వారు చెప్పే వీడియోలున్నాయని ముకుల్‌ రోహతగి అన్నపుడు- ‘వారు సభకు రావొచ్చు, రాకపోవచ్చు, అది వారిష్టం. వారు తమ నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకొనేట్లు కోర్టు ఏం చేయగలదనేదే మా ముందున్న ప్రశ్న. ఓ రాజ్యాంగ బాధ్యతగా మేం ఇది నిర్వర్తించాలి’ అని బెంచ్‌ పేర్కొంది.  మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అధికార పార్టీ కాంగ్రెస్‌ దాఖలు చేసిన  పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలెవరూ స్పీకర్‌ ఎదుట హాజరుకాబోరని వారి తరుఫు లాయర్‌ మణిందర్‌ సింగ్‌ వాదించారు.  ‘‘మమ్మల్ని ఎవరూ అపహరించలేదు. కాంగ్రెస్‌ నేతలను కలుసుకోవాలని మేం భావించడం లేదు. మమ్మల్ని బలవంత పెట్టడానికి ఏ చట్టం ఒప్పుకోద’’న్న ఎమ్మెల్యేల వాదనను ఆయన కోర్టుకు తెలిపారు. బలపరీక్ష జరపాలని కోరే హక్కు అసలు గవర్నర్‌కు లేనేలేదని, స్పీకర్‌కు మాత్రమే ఉంటుందంటూ స్పీకర్‌ ప్రజాపతి తరఫున అభిషేక్‌ మనుసింఘ్వీ వాదించారు.


బెంగళూరు రిసార్ట్‌ వద్ద హైడ్రామా

బెంగళూరులో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్‌ బయట బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. వారిని కలిసేందుకు పోలీసులు తనను అనుమతించడం లేదంటూ మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ ధర్నాకు దిగారు. దిగ్విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, తర్వాత విడిచిపెట్టారు.  తాము స్వచ్ఛందంగానే బెంగళూరు వచ్చామని, ఎవర్నీ కలవాలనుకోవడం లేదని ఎమ్మెల్యేలు వీడియో మెసేజ్‌ల ద్వారా తెలిపారు. 

Updated Date - 2020-03-19T10:36:48+05:30 IST