యాంటీ రోమియో ఎక్కడ.. యోగి సర్కార్‌పై అఖిలేశ్ ఫైర్..
ABN , First Publish Date - 2020-10-20T05:27:41+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ శక్తి కార్యక్రమం ఓ తప్పుడు ప్రచారమని యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ..

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ శక్తి కార్యక్రమం ఓ తప్పుడు ప్రచారమని యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. మహిళల భద్రత, సాధికారత కోసం శనివారం బలరాంపూర్ జిల్లాలో సీఎం యోగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో బీజేపీ ప్రభుత్వాన్ని అప్రదిష్ట వస్తున్న నేపథ్యంలోనే మిషన్ శక్తి ప్రారంభించారని అఖిలేశ్ ఆరోపించారు. ‘‘మిషన్ శక్తి పేరుతో ముఖ్యమంత్రి మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇదే ప్రభుత్వం మొదలుపెట్టిన యాంటీ-రోమియో బృందాలు ఏమయ్యాయన్న ప్రశ్నకు సమాధానం కోసం రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ ఎదురుచూస్తోంది. మహిళల భద్రత కోసం సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం 1090ను ఓ భద్రతా కవచంగా తీర్చిదిద్దితే.. బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది...’’ అంటూ అఖిలేశ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి నాలుగేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు ఏదీ కొత్తగా చేపట్టలేకపోయిందనీ.. కేవలం సమాజ్వాదీ పార్టీ హయాంలో చేపట్టిన పనులనే ప్రారంభిస్తూ గడుపుతోందని ఎద్దేవా చేశారు.