తప్పుడు విధానాలతోనే దేశంలో సంక్షోభం: సోనియా

ABN , First Publish Date - 2020-06-24T00:56:54+05:30 IST

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ నిర్వహణా లోపాలు, తప్పుడు విధానాల కారణంగానే దేశం సంక్షోభంలోకి జారిందని కాంగ్రెస్ తాత్కాలిక..

తప్పుడు విధానాలతోనే దేశంలో సంక్షోభం: సోనియా

న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ నిర్వహణా లోపాలు, తప్పుడు విధానాల కారణంగానే దేశం సంక్షోభంలోకి జారిందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితి, కరోనా బెడద తదితర అంశాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో‌ సీడబ్ల్యూసీ చర్చించింది. సోనియాగాంధీ అధ్యక్షతన వహించిన సిడీబ్ల్యూసీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.


'భారతదేశాన్ని భయంకరమైన ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ఒకవైపు కోవిడ్ మహమ్మారి, ఇప్పుడు చైనాతో సరిహద్దుల్లో పూర్తి స్థాయి సంక్షోభం చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్వహణా లోపాలు, తప్పుడు విధానాలే సంక్షోభ కారణాలుగా చెప్పాలి. దీంతో విస్తృత స్థాయిలో కష్టాలు, భయాలు, భద్రతా ముప్పు, దేశ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వంటివి ఇబ్బడిముబ్బడి అవుతున్నాయి' అని సోనియా తూర్పారబట్టారు. ఈ పరిస్థితుల్లో విత్త స్థిరీకరణ, పేద ప్రజలకు నేరుగా నగదు అందేలా చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిరక్షణ, వాటిని ప్రోత్సహించడం వంటి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తుత్తి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి చేతులు దులుపేసుకుందని తప్పుపట్టారు.


పెట్రో వాతలు...

ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పడిపోయిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా 17వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోవడాన్ని సోనియాగాంధీ తప్పుపట్టారు. ఈ చర్య సామాన్య ప్రజానీకం ఇబ్బందులను మరింత పెంచుతున్నాయని అన్నారు. గత 42 ఏళ్లలో దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం ఇదే మొదటి సారని పేర్కొన్నారు.


చైనాతో సంక్షోభం...

ప్రస్తుతం ఎల్‌ఏసీ వెంబడి చైనాతో సంక్షోభాన్ని చవిచూస్తున్నామని, గత ఏప్రిల్-మే నుంచి ఇప్పటి వరకూ చైనా బలగాలు మన భూభాగమైన పాంగాంగ్‌ లేక్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, లడక్‌లోకి చొరబడ్డాయనడం కొట్టిపారేయలేని వాస్తవమని ఆమె కుండబద్దలు కొట్టారు. వాస్తవం ఇలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చొరబాట్లు లేవని చెబుతోందని మండిపడ్డారు.


'2020 మే 5న చొరబాటు జరిగినట్టు కనిపెట్టారు. దీనికి పరిష్కారం కనుగొనక పోవడంతో పరిస్థితి విషమించి 15-16 తేదీల్లో ఘర్షణలకు దారితీసింది. 20 మందికి పైగా భారత సైనికులు మృతి చెందారు. 80 మంది గాయపడితే, పది మంది తిరిగొచ్చేంత వరకూ వారి జాడ తెలియలేదు. ప్రధాని మాత్రం లడక్‌లోని మన భూభాగంలోకి ఎవరూ చొరబడ లేదని చెబుతున్నారు' అని సోనియాగాంధీ అన్నారు.


జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల్లో దేశం ఎప్పుడూ ఒక్కమాటపైనే ఉంటుందని, ఈసారి కూడా అలాగే ఉంటుందని, ఈ విషయంలో రెండో ఆలోచనలకు తావే లేదని సోనియా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు భరోసాగా ఉంటామని కాంగ్రెస్ పార్టీనే మొదటిగా చెప్పిందని గుర్తుచేశారు. అయితే, పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందనే అభిప్రాయాలు జనాల్లో ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా, సోనియాగాంధీ వాదనను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బలపరిచారు. దేశంలోని సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయాలని, సరిహద్దు సంక్షోభాన్ని సమర్ధవంతంగా పరిష్కరించకుంటే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుందని అన్నారు.

Updated Date - 2020-06-24T00:56:54+05:30 IST