లాక్‌డౌన్ టైమ్‌లో పిల్లలకు ఎఫ్ఎం రేడియో పాఠాలు

ABN , First Publish Date - 2020-03-25T18:07:02+05:30 IST

ఒకనాడు తెలుగునాట రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య పాఠాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.

లాక్‌డౌన్ టైమ్‌లో పిల్లలకు ఎఫ్ఎం రేడియో పాఠాలు

రాయ్‌పూర్:  ఒకనాడు తెలుగునాట రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య పాఠాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ‘బాలానందం’ పేరుతో ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించి.. చిన్నారులను బుద్ధిజీవులుగా తీర్చిదిద్దారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. తాజాగా ఇలాంటి ఆలోచననే యునిసెఫ్, రేడియో మిర్చి సంస్థ సంయుక్తంగా చేపట్టాయి. ఎఫ్ఎం అంటే కేవలం పాటలు మాత్రమే కాకుండా పాఠాలు కూడా వినిపిస్తామంటూ రేడియో మిర్చి ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చత్తీస్‌గఢ్ కేంద్రంగా పని చేసే రేడియో మిర్చి.. యునిసెఫ్ సహకారంతో రేడియో స్కూలింగ్‌ను మార్చ్ 24న ప్రారంభించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం ఐదు గంటలకు రేడియో పాఠాలను అందిస్తోంది. ‘మిర్చికి పాఠశాల’ పేరుతో 3 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 


ఈ కార్యక్రమం వెనక ముఖ్య ఉద్దేశం.. పిల్లల్లోని అభ్యాస లక్షణాలను పెపొందించడంతో పాటు కరోనాపై అవగాహన కలిగించడం, అలాగే తల్లిదండ్రులు, బంధువులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలతో పిల్లలకు ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేయడమని చత్తీస్‌గఢ్ యునిసెఫ్ ప్రతినిధి జచరియా అన్నారు. నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేలా, సృజనాత్మకత పెంచేలా తమ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హిందీ, ఇంగ్లీషులలో పాఠాలు ఉంటాయన్నారు. 

Updated Date - 2020-03-25T18:07:02+05:30 IST