వూహాన్‌లో 80 మంది భారతీయ విద్యార్థులు

ABN , First Publish Date - 2020-02-08T08:28:39+05:30 IST

కరోనా వైర్‌సకు కేంద్రస్థానమైన వూహాన్‌లో ఇంకా 80 మంది దాకా భారతీయ విద్యార్థులున్నారని ..

వూహాన్‌లో 80 మంది భారతీయ విద్యార్థులు

  • వారిలో 70 మంది అక్కడే ఉండడానికి సుముఖం
  • 10 మంది కరోనా స్ర్కీనింగ్‌లో విఫలమయ్యారు
  • పొరుగుదేశాలన్నింటికీ సాయం చేస్తామన్నాం
  • మాల్దీవులు మాత్రమే వాడుకుంది: జైశంకర్‌

న్యూఢిల్లీ, బీజింగ్‌, ఫిబ్రవరి 7: కరోనా వైర్‌సకు కేంద్రస్థానమైన వూహాన్‌లో ఇంకా 80 మంది దాకా భారతీయ విద్యార్థులున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్‌ రాజ్యసభలో ప్రకటించారు. ప్రభుత్వం తరలింపు ఆపరేషన్‌ చేపట్టినప్పుడు.. వారిలో 70 మంది అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారని వివరించారు. మిగతా పది మందీ భారత్‌కు తిరిగి వచ్చేయడానికి సిద్ధపడ్డా.. అక్కడ విమానాశ్రయంలో జరిపిన స్ర్కీనింగ్‌ పరీక్షల్లో విఫలమవడంతో రాలేకపోయారని వెల్లడించారు.


చైనాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ 80 మందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతోందని మంత్రి చెప్పారు. అటు జపాన్‌లో క్వారంటైన్‌గా మార్చిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌక సిబ్బందితో పాటు నౌకలోనూ భారతీయులు ఉన్నారని జైశంకర్‌ తెలిపారు. టోక్యోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం మేరకు వారెవరికీ వైరస్‌ సోకలేదని వివరించారు. తమ పౌరులను చైనా నుంచి తరలించాల్సిందిగా పాకిస్థాన్‌ ఏమైనా కోరిందా అని బీజేపీ నామినేటెడ్‌ ఎంపీ రూపా గంగూలీ వేసిన ప్రశ్నకు మంత్రి జవాబు చెప్పారు.


‘‘ఇక్కడి నుంచి రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరే ముందు.. భారతీయ విద్యార్థులనే కాక మన పొరుగుదేశాలకు చెందిన విద్యార్థులందరినీ తీసుకొస్తామని చెప్పాం. కానీ మాల్దీవులు మాత్రమే ఆ ఆఫర్‌ను వినియోగించుకుంది’’ అని వివరించారు. జనవరి 18 నుంచి ఇప్పటిదాకా 1275 విమానాల్లో వచ్చిన 1,39,539 మంది పేషెంట్లకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ రాజ్యసభలో  ఒక ప్రకటన చేశారు. చైనా నుంచి భారత్‌కు వస్తున్న విదేశీయులందరి వీసాలనూ  ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే.. విదేశాల నుంచి వచ్చేవారందరికీ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని, క్వారంటైన్‌ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని దేశంలోని 12 ప్రధాన పోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటిదాకా 1232 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1199 మందికి నెగెటివ్‌ అని తేలిందని, ముగ్గురికి పాజిటివ్‌ రాగా, మరో ముప్పై నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


మరోవైపు.. ఢిల్లీ నుంచి పుణెకు వెళ్తున్న విమానంలో ఒక చైనీయుడు వాంతులు చేసుకోవడంతో అతణ్ని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. కాగా.. కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ తయారుచేసే ప్రయత్నంలో ఉన్న ‘కామన్వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఆస్ట్రేలియా) శాస్త్రజ్ఞుల బృందానికి ఎస్‌.ఎ్‌స.వాసన్‌ అనే భారతీయుడు నాయకత్వం వహిస్తున్నారు. 


6000 జంటలు ఒక్కటైన వేళ

అసలే కరోనా వైరస్‌ ముప్పు! ఎక్కువ మంది ఒకచోట చేరితే ఏమవుతుందో అన్న భయం!! అలాంటి భయాలన్నింటినీ అధిగమించి దక్షిణకొరియాలో 6 వేల జంటలు ఇలా వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. నిర్వాహకులు జంటలన్నింటికీ మాస్కులు ఇచ్చినా.. తీరా పెళ్లి జరిగే సమయానికి చాలా మంది మాస్కులు తీసేశారు. కొన్ని జంటలు మాత్రం మాస్కులు ధరించేఉంగరాలు మార్చుకున్నాయి.


ప్రజాయుద్ధం

కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 637కు చేరింది. ఒక్క గురువారంనాడే 73 మంది మరణించారని చైనా జాతీయ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. ఇక, ఈ వైరస్‌ గురించి ముందే హెచ్చరించి.. ఆ వైర్‌సకే బలైపోయిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ మృతికి చైనా సంతాపం తెలిపింది. ఆయన కుటుంబసభ్యులకు దాదాపు రూ.83 లక్షలు పరిహారంగా ప్రకటించింది. వైర్‌సపై పోరుకు ప్రజాయుద్ధాన్ని ప్రారంభించింది. 


Updated Date - 2020-02-08T08:28:39+05:30 IST