అహ్మదాబాద్‌‌లో పోలీసులపై రాళ్లు రువ్విన కార్మికులు

ABN , First Publish Date - 2020-05-18T21:42:06+05:30 IST

తమను స్వస్థలాలకు పంపించాలంటూ అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ ప్రాంతంలో వంద మంది వలస కార్మికులు రోడ్డెక్కారు. అంతేకాకుండా

అహ్మదాబాద్‌‌లో పోలీసులపై రాళ్లు రువ్విన కార్మికులు

అహ్మదాబాద్: తమను స్వస్థలాలకు పంపించాలంటూ అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ ప్రాంతంలో వంద మంది వలస కార్మికులు రోడ్డెక్కారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వలస కార్మికులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు షెల్స్‌ను ప్రయోగించారు. వంద మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారని సమాచారం అందుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సీనియర్ పోలీసు అధికారులతో పాటు అదనపు బలగాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉన్నట్లుండి వలస కార్మికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తమను స్వస్థలాలకు పంపించాలంటూ ఆందోళనలు చేయడం ప్రారంభించారని స్థానికులు పేర్కొన్నారు.


ఈ ఘటనపై జాయింట్ పోలీస్ కమిషనర్ అమిత్ విశ్వకర్మ మాట్లాడుతూ... ‘‘చాలా రోజులుగా స్వస్థలాలకు పంపించాలంటూ వలస కార్మికులు కోరుతున్నారు. వీలైనంత తొందరగా వారిని పంపిచే ఏర్పాట్లు చేస్తాం. 400 నుంచి 500 వరకూ వలస కార్మికులు ఈ లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారు ఆందోళనకు దిగడంతో వెనక్కి వెళ్లిపోవాలంటూ పోలీసులు వారిని కోరారు’’ అని ఆయన స్పష్టం చేశారు.


ఈ విషయంలో స్థానిక అధికారులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని తాము నచ్చజెబుతూనే ఉన్నామని, అయినా వినకుండా వారు ఆందోళనకు దిగారని, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జాయింట్ కమిషనర్ అమిత్ తెలిపారు. 

Updated Date - 2020-05-18T21:42:06+05:30 IST