వలస కూలీల ఆందోళన.. పోలీసులపైకి రాళ్లు!
ABN , First Publish Date - 2020-05-18T23:39:21+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా నగరంలో చిక్కుకుపోయిన వలస కూలీలు ఈ రోజు అహ్మదాబాద్‌లో ఆందోళనకు దిగారు.

అహ్మదాబాద్: లాక్‌డౌన్ కారణంగా నగరంలో చిక్కుకుపోయిన వలస కూలీలు ఈ రోజు అహ్మదాబాద్‌లో ఆందోళనకు దిగారు. తమను వెంటనే స్వగ్రామాలకు పంపించాలంటూ పోలీసులు, అటుగా వెళ్తున్న వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐఐఎం అహ్మదాబాద్‌ను వాస్త్రాపూర్‌తో కలిపే రద్దీ రహదారిపైకి ఒకేసారిగా దాదాపు 100 మంది వలస కార్మికులు వచ్చి ఆందోళనకు దిగారు. తమను వెంటనే స్వస్థలాలకు పంపాలని పోలీసులను కోరారు. వారు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో ఊగిపోయిన కూలీలు రాళ్ల దాడికి దిగారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం దాదాపు వందమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు బృందాలు తరలివచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
నగరంలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తమను స్వస్థలాలకు పంపాలంటూ స్థానిక అధికారులను గత కొన్ని రోజులుగా అడుగుతున్నట్టు పోలీస్ జాయింట్ కమిషనర్ అమిత్ విశ్వకర్మ తెలిపారు. లేబర్ కాలనీలో దాదాపు 500 మంది వరకు వలస కార్మికులు నివసిస్తూ సమీపంలో నిర్మాణ పనులు చేస్తున్నారు. తమను సొంత గ్రామాలకు పంపించాలంటూ గత కొంతకాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కొందరు రోడ్డుపైకి వచ్చి తమను సొంతూళ్లకు పంపాలని పోలీసులను అడిగినట్టు జేసీపీ తెలిపారు.
అధికారులు అదే పనిలో ఉన్నారని, సమస్య పరిష్కారం అవుతుందని పోలీసులు వారితో చెప్పారని, దీంతో కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసులపైకి రాళ్లు రువ్వినట్టు ఆయన వివరించారు. ఈ ఘటన తర్వాత నగర పోలీసులు లేబర్ కాలనీలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి 100 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్టు వస్త్రాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంఎం జడేజా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆయన వివరించారు.