కరోనా ఎఫెక్ట్: ఊరుగాని ఊరిలో ఆగిన రైలు.. భాష కూడా తెలియక..!

ABN , First Publish Date - 2020-03-25T19:10:06+05:30 IST

దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో దేశంలోని పలుచోట్ల వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది...

కరోనా ఎఫెక్ట్: ఊరుగాని ఊరిలో ఆగిన రైలు.. భాష కూడా తెలియక..!

చెన్నై: లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో దేశంలోని పలుచోట్ల వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిన్న ఢిల్లీలో చిక్కుకున్న కార్మికుల దయనీయ పరిస్థితి మర్చిపోక ముందే ఇవాళ చెన్నైలో అదే తరహా ఇబ్బందులు వెలుగుచూశాయి. రైలు సర్వీసులు నిలిపివేయడంతో అధికారులు స్టేషన్ల నుంచి వలస కార్మికులందర్నీ చెన్నైలోని కమ్యునిటీ హాళ్లకు తరలించారు. దీంతో ఊరుగాని ఊర్లో కనీసం అక్కడి భాష కూడా తెలియక వలస కార్మికులు బిక్కుబిక్కుమంటున్నారు.


‘‘మేము కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్నాము. చెన్నైలో రైలు మారాల్సి ఉండడంతో ఇక్కడికి వచ్చాం. అయితే ఒక్కసారిగా రైళ్లు రద్దుకావడంతో మేమంగా ఇక్కడే చిక్కుబడిపోయాం...’’ అని హౌరాకి చెందిన 20 ఏళ్ల మహ్మద్ సాదిఖ్ పేర్కొన్నాడు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తుందని తొలుత భావించామనీ... కానీ పరిస్థితి చూస్తే ఇక్కడే మరికొద్ది రోజులు ఉండక తప్పేట్టు లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2 వేల మందిని ఒకే చోట ఉంచడంతో... వీరిలో ఒక్కరికి ఇన్‌ఫెక్షన్ సోకినా అందరికీ వ్యాపిస్తుందని వీళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా చెన్నై కార్పొరేషన్ అధికారులు తమను బాగానే చూసుకుంటున్నారనీ... ఆహార పొట్లాలు కూడా అందజేస్తున్నారని వారు పేర్కొనడం గమనార్హం.  

Read more