ఆర్‌ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య కన్నుమూత
ABN , First Publish Date - 2020-12-20T08:22:51+05:30 IST
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎ్‌సఎస్) సిద్ధాంతకర్తల్లో ఒకరైన మాధవ్ గోవింద్ వైద్య(97) కన్నుమూశారు. వైద్య ఇటీవల కరోనా బారినపడ్డారు.

నాగ్‌పూర్, డిసెంబరు 19: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎ్‌సఎస్) సిద్ధాంతకర్తల్లో ఒకరైన మాధవ్ గోవింద్ వైద్య(97) కన్నుమూశారు. వైద్య ఇటీవల కరోనా బారినపడ్డారు. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. మాధవ్ గోవింద్ వైద్య.. ఎంజీ వైద్యగా సుపరిచితులు. ఆర్‌ఎ్‌సఎస్ తొలి అధికార ప్రతినిధి అయిన ఆయన జర్నలిస్టు. ‘నాగపూర్ తరుణ్ భారత్’ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. సంస్కృత పండితుడైన ఎంజీ వైద్య శాసన మండలి సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం నాగ్‌పూర్‌లోని అంబజారీ ఘాట్‌లో నిర్వహిస్తారు.
8వ ఏట ఆర్‌ఎ్‌సఎ్‌సలో చేరిన ఎంజీ వైద్య 95వ ఏట వరకు సంఘ్ రోజువారీ సమావేశాల(శాఖ)కు హాజరయ్యేవారు. సులభమైన భాషా శైలితో సంఘ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రసంగాలు చేశారు. ఆయన కుమారుడు డాక్టర్ మన్మోహన్ వైద్య ప్రస్తుతం ఆర్‌ఎ్‌సఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి. ఎంజీ వైద్య మృతికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి సంతాపం తెలిపారు. కాగా, ప్రధాని అభ్యర్థిత్వానికి అడ్డురాకుండా ఉండేందుకు మోదీ.. బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ 2012లో ఎంజీ వైద్య తన బ్లాగ్ ‘భాష్య’లో పేర్కొనడం అప్పట్లో వివాదానికి దారితీసింది.