హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా మెట్రో నగరాలు

ABN , First Publish Date - 2020-08-20T08:49:00+05:30 IST

భారత్‌లోని ప్రధాన నగరాలు సామూహిక రోగ నిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ)ని సాధించే దిశగా వెళ్తున్నాయా ? ఈ ప్రశ్నకు పలువురు సాంక్రమిక వ్యాధి నిపుణులు ఔననే సమాధానమే చెబుతున్నారు...

హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా మెట్రో నగరాలు

  • ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరిలో కరోనా యాంటీబాడీలు
  • దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి నిర్వహించిన పరీక్షల్లో వెల్లడి
  • థైరోకేర్‌ ల్యాబ్‌ నివేదిక 
  • పుణె, ముంబై, ఢిల్లీల్లో నిర్వహించిన సీరో సర్వేల్లోనూ ఇలాంటి ఫలితాలే 

న్యూఢిల్లీ, ఆగస్టు 19 : భారత్‌లోని ప్రధాన నగరాలు సామూహిక రోగ నిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ)ని సాధించే దిశగా వెళ్తున్నాయా ? ఈ ప్రశ్నకు పలువురు సాంక్రమిక వ్యాధి నిపుణులు ఔననే సమాధానమే చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చే వివరాలతో దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్‌ సేవలు అందించే ‘థైరోకేర్‌ ల్యాబ్‌’ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రతీ నలుగురు భారతీయుల్లో ఒకరిలో కరోనాను తిప్పికొట్టే ప్రతిరక్షకాలు (యాంటీబాడీ) ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ సంస్థ 2 లక్షల మందికిపైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించగా, 24 శాతం మందిలో యాంటీబాడీల ను గుర్తించామని థైరోకేర్‌ తెలిపింది. ఢిల్లీలో పరీక్షలు చేయించుకున్న వారిలో 29 శాతం మంది, మహారాష్ట్రలో 20 శాతం మందిలో సీరో పాజిటివిటీ ఉందని పేర్కొంది. ముంబైలో 27 శాతం మందిలో, అదే నగరం పరిధిలోని నవీ ముంబైలో 21 శాతం మంది లో, పొరుగునే ఉన్న థానేలో ప్రతి ముగ్గురిలో ఒక్కరి శరీరంలో కరోనాను కట్టడిచేసే యాంటీబాడీలున్నాయని నివేదికలో ప్రస్తావించారు.


ఢిల్లీ, ముంబై, పుణెలలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వేల ఫలితాలు కూడా ఈ నివేదికకు బలం చేకూర్చేలా ఉన్నాయి. తాజాగా పుణె కార్పొరేషన్‌ విడుదల చేసిన సీరో సర్వే నివేదికలో అక్కడి పౌరుల్లో సగం (50 శాతం) మందిలో సీరో పాజిటివిటీని గుర్తించడం గమనార్హం. ఇక ముంబైలోని మురికి వాడల్లోనైతే మరీ అత్యధికంగా 57 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు వెల్లడైంది. ఏప్రిల్‌, మే నాటికి భారీ కరోనా కేసులతో దడ పుట్టించిన ధారావి ఏరియాలో.. గత రెండు నెలలుగా వ్యాప్తిరేటు సున్నాకు దరిదాపుల్లోనే ఉంటోంది. ధారావి ప్రజల్లో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది అనేందుకు ఈ గణాంకాలను సాక్ష్యంగా చెప్పుకోవచ్చని మహారాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి అభివర్ణించారు. జూలై మొదటివారంలో ఢిల్లీలో సర్వే నిర్వహించగా అక్కడి జనాభాలో 23 శాతం మందిలో సీరో పాజిటివిటీ బయటపడింది.  
తక్కువ మరణాలకు కారణమిదే

కొవిడ్‌ కేసుల పెరుగుదల ఇప్పుడున్న రేటులోనే కొనసాగితే.. దేశంలో సీరో పాజిటివిటీ రేటు 24 శాతం నుంచి 35 శాతానికి చేరే సూచనలున్నాయని థైరో కేర్‌ ల్యాబ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆరోక్యస్వామి వేలుమణి విశ్లేషించారు. సీరో పాజిటివిటీ రేటు 45 శాతం దాటిన తర్వాత వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేశారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి పది లక్షల మందిలో 600 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతుంటే, భారత్‌లో ఆ సంఖ్య 39కే పరిమితమవడాన్ని సానుకూల అంశంగా వేలుమణి అభివర్ణించారు. అయితే ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో ప్రతీ మిలియన్‌ జనాభాకు దాదాపు 200 మంది కరోనా ఇన్ఫెక్షన్‌తో మృత్యువాత పడుతున్నారని ఆయ న గుర్తుచేశారు. అమెరికన్ల సగటు వయసు 45 ఏళ్లు కాగా, భారతీయుల సగటు వయసు 29 ఏళ్లే. భారత్‌లో కొవిడ్‌ మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఇక్కడ యువత జనాభా ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని బెంగళూరుకు చెందిన  సాంక్రమిక వ్యాధి నిపుణులు డాక్టర్‌ గిరిధర బాబు తెలిపారు. 

Read more