మహబూబా ముఫ్తీపై ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-10-27T14:31:39+05:30 IST
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ...

వడోదర: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి భారతదేశమన్నా, ఇక్కడి చట్టాలన్నా ఇష్టం లేకపోతే ఆమె కుటుంబంతో సహా పాకిస్తాన్ వెళ్లిపోవాలని సూచించారు.
వడోదర పరిధిలోని కురారీ గ్రామంలో ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితిన్ పటేల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశ రక్షణకు పౌరసత్వ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశారన్నారు. గడచిన రెండు రోజులుగా మహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆమె విమానం టిక్కెట్ కొనుక్కొని తన కుటుంబంతో సహా పాక్‌లోకి కరాచీ వెళ్లిపోవాలని సూచించారు. ఇది అందరికీ మంచిదన్నారు. ఆమెకు విమానం టిక్కెట్ కొనుక్కునేందుకు డబ్బులు కూడా పంపిస్తామన్నారు. ఆమెకు భారత్ ఇష్టంలేకపోయినా, ఇక్కడి ప్రభుత్వం చేసిన సీఏఏ చట్టం, ఆర్టికల్ 370 రద్దు మొదలైనవి ఇష్టం లేకపోతే ఆమె పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నారు. ఎవరైనా సరే ఇక్కడ తమకు భద్రత, సంతోషం లేదనుకుంటే వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోవడం మంచిదన్నారు.