మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఆధిక్యం

ABN , First Publish Date - 2020-11-15T17:06:53+05:30 IST

మయన్మార్ అధికార పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ

మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఆధిక్యం

న్యూఢిల్లీ : మయన్మార్ అధికార పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్‌డీ) పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 920 స్థానాల్లో గెలిచి, సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. 


యూనియన్ ఎలక్షన్ కమిషన్ (యూఈసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 1,117 పార్లమెంటరీ స్థానాలకు 5,639 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రతినిథుల సభ (దిగువ సభ)లోని 315 స్థానాలు, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్ (ఎగువ సభ)లోని 161 స్థానాలు, రీజనల్ లేదా స్టేట్ పార్లమెంటులలోని 612 స్థానాలు, ఎథ్నిక్ మైనారిటీ సీట్లు 29 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 


ఈ త్రీ లెవెల్ పార్లమెంటులో ఎన్ఎల్‌డీ 1,106 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. వీరిలో 920 మంది గెలిచారు. దిగువ సభకు పోటీ చేసినవారిలో 258 మంది, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్‌కు పోటీ చేసినవారిలో 138 మంది, రీజనల్ లేదా స్టేట్ పార్లమెంటులకు పోటీ చేసినవారిలో 501 మంది, ఎథ్నిక్ మైనారిటీ సీట్ల నుంచి 23 మంది గెలిచారు. 


యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) 1,089 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. వీరిలో 71 మంది మాత్రమే విజయం సాధించారు. దిగువ సభలో 26 మంది, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్ నుంచి ఏడుగురు, రీజనల్ లేదా స్టేట్ పార్లమెంటుల నుంచి 38 మంది గెలిచారు. 


మయన్మార్ ప్రెసిడెంట్ యూ విన్ మ్యింట్, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకి దిగువ సభ సభ్యులుగా గెలిచారు. మయన్మార్ వైస్ ప్రెసిడెంట్ హెన్రీ వ్యాన్ థియో ఎగువ సభకు ఎన్నికయ్యారు. 


Updated Date - 2020-11-15T17:06:53+05:30 IST