కరోనా నిబంధనలకు నీళ్లొదిలిన మేరీకోమ్?.. ఇంతకీ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-03-22T01:02:43+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంతటి భయాందోళనలు కలిగిస్తుందో తెలిసిందే. విదేశాల నుంచి ఎవరొచ్చినా కచ్చితంగా 14రోజులపాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

కరోనా నిబంధనలకు నీళ్లొదిలిన మేరీకోమ్?.. ఇంతకీ ఏం చేసిందంటే..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంతటి భయాందోళనలు కలిగిస్తుందో తెలిసిందే. విదేశాల నుంచి ఎవరొచ్చినా కచ్చితంగా 14రోజులపాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇలాంటి సమయంలో ప్రముఖ మహిళా బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ మేరీకోమ్ క్వారంటైన్ నిబంధనలకు నీళ్లొదిలేసింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఆసియా-ఓషనియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు భారత బాక్సర్ల బృందం విదేశాలకు వెళ్లింది. ఆ సమయంలో కొన్ని రోజులు ఇటలీలో శిక్షణ తీసుకున్న వీరు.. ఆ తర్వాత జోర్డాన్ వెళ్లారు. క్వాలిఫైయర్స్ అనంతరం మార్చి 13న స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో వీరంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటారని ఈ బృందంలోని కోచ్‌లు చెప్పారు. అయితే రాజ్యసభ సభ్యురాలైన మేరీకోమ్ ఈ నిబంధనలను పక్కనబెట్టింది. ఈ నెల 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎంపీలకు ఇచ్చిన అల్పాహార విందులో ఆమె పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ వర్గాలు ట్వీట్ చేశాయి. ఈ ఫొటోల్లో మేరీకోమ్‌ను చూసిన వారంతా షాకయ్యారు. ఇదేం పని? అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. తాను రాష్ట్రపతి ఇచ్చిన అల్పాహార విందుకు హాజరైనట్లు మేరీకోమ్ కూడా ధ్రువీకరించింది. అయితే ఇదే విందులో పాల్గొన్న మరో ఎంపీ దుష్యంత్ సింగ్‌ను తను కలవలేదని స్పష్టంచేసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన కనికా కపూర్ ఇచ్చిన పార్టీలో దుష్యంత్‌సింగ్ పాల్గొన్నారు. ఆయన్ను రాష్ట్రపతి కలిశారు కూడా. ఈ క్రమంలో కోవింద్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2020-03-22T01:02:43+05:30 IST