యస్ బ్యాంక్‌పై మారటోరియం ఎత్తివేత

ABN , First Publish Date - 2020-03-19T02:53:46+05:30 IST

యస్ బ్యాంక్‌పై విధించిన మారటోరియానికి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు తెర పడింది. అన్ని రకాల కార్యకలాపాలను యథావిథిగా పునరుద్ధరించినట్లు బ్యాంకు ప్రకటించింది.

యస్ బ్యాంక్‌పై మారటోరియం ఎత్తివేత

న్యూఢిల్లీ : యస్ బ్యాంక్‌పై విధించిన మారటోరియానికి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు తెర పడింది. అన్ని రకాల కార్యకలాపాలను యథావిథిగా పునరుద్ధరించినట్లు బ్యాంకు ప్రకటించింది. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులకు గొప్ప ఉపశమనం కలిగింది. 


సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకు పునరుద్ధరణకు ప్రణాళికను ప్రకటించడంతో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. 


యస్ బ్యాంక్ ఇచ్చిన ట్వీట్‌లో ‘‘మా బ్యాంకింగ్ సేవలు ఇప్పుడు నడుస్తున్నాయి. మీరు ఇప్పుడు మా పరిపూర్ణ సేవలను అందుకోవచ్చు. మీ సహనం, సహకారాలకు ధన్యవాదాలు’’ అని పేర్కొంది. 


మరొక ట్వీట్‌లో ‘‘మీకు మెరుగ్గా సేవలందించేందుకు 2020 మార్చి 19 నుంచి 21 వరకు ఒక గంట ముందుగా, ఉదయం 8.30కు మా శాఖలను తెరుస్తాము. వయోవృద్ధులైన కస్టమర్ల కోసం అన్ని శాఖల్లోనూ బ్యాంకింగ్ వేళలను 2020 మార్చి 19 నుంచి 27 వరకు 16.30 గంటల నుంచి 17.30 గంటల వరకు పొడిగిస్తున్నాం’’ అని యస్ బ్యాంక్ పేర్కొంది.


దీంతో మార్చి 5న విధించిన ఆంక్షలు తొలగిపోయినట్లే. యస్ బ్యాంకు ఖాతాదారులు రూ.50,000 వరకు మాత్రమే ఉపసంహరించుకోవచ్చునని విధించిన ఆంక్షలు కూడా తొలగిపోయినట్లే. 


Updated Date - 2020-03-19T02:53:46+05:30 IST