రైతులు కనిపించడం లేదు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-02T00:04:39+05:30 IST

రైతులు కనిపించడం లేదు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

రైతులు కనిపించడం లేదు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనపై కేంద్ర మంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో చాలా మంది రైతుల్లాగా కనిపించడం లేదని, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, రైతు కమిషన్ల సభ్యులే ఉన్నారని ఆయన అన్నారు. ఓవైపు ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు చేస్తుండగా మరోవైపు ప్రభుత్వంలోని పెద్దలు రైతుల నిరసనపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.


‘‘రైతుల నిరసనల్లో ఎక్కువ మంది రైతుల్లాగా కనిపించడం లేదు. ఈ నిరసనల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం జరిగిందనేది మనం ఆలోచించాలి. నాకు తెలిసీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు. నిజానికి వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి సమస్యా లేదు. ఇదంతా బయటి వ్యక్తులు చేస్తున్న పని. ఈ నిరసనల్లో కనిపించే వారంతా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు రైతు కమిషన్ల సభ్యులు. వీళ్లే దీని వెనుక ఉండి నడిపిస్తున్నారు’’ అని వీకే సింగ్ అన్నారు.


నిరవధికంగా చేస్తున్న రైతుల నిరసనకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు తెలియజేయడానికి రైతులకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. ఉత్తర ఢిల్లీలోని నిరంకారి మైదానంలో ఆందోళనను  శాంతియుతంగా కొనసాగించాలని  పోలీసులు కోరారు. రైతు సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ, భారతీయ కిసాన్‌ యూనియన్‌తోపాటు మరిన్ని సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది రైతులు గురువారమే ఢిల్లీని చుట్టుముట్టారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు ప్రకటించినప్పటికీ రైతుల నిరసనకు దిగిరాక తప్పలేదు.

Updated Date - 2020-12-02T00:04:39+05:30 IST