జవాన్లను అవమానించారు
ABN , First Publish Date - 2020-10-24T08:34:15+05:30 IST
దేశ సైనికులను నరేంద్ర మోదీ అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ’వాస్తవాధీన రేఖ దాటి 1200 కిలోమీటర్ల మేర చైనా దళాలు చొచ్చుకొచ్చాయి. మన భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. గల్వాన్ లోయలో మన సైనికులను చంపేశాయి. వారిలో అనేకమంది బిహారీలున్నారు...

- మోదీపై రాహుల్ గాంధీ ఎదురుదాడి
హిసువా- భాగల్పూర్, అక్టోబరు 23: దేశ సైనికులను నరేంద్ర మోదీ అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ’వాస్తవాధీన రేఖ దాటి 1200 కిలోమీటర్ల మేర చైనా దళాలు చొచ్చుకొచ్చాయి. మన భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. గల్వాన్ లోయలో మన సైనికులను చంపేశాయి. వారిలో అనేకమంది బిహారీలున్నారు. కానీ ప్రధాని మాత్రం పీఎల్‌ఏ దళాలు అసలు భారత భూభాగంలోకి జొరబడనే లేదని చెప్పుకొచ్చారు. మోదీజీ! చైనా దళాలను వారి భూభాగంలోకి ఎప్పుడు తరిమేస్తున్నారో చెప్పండి’ అని రాహుల్ ప్రశ్నించారు. జాతీయవాదిగా చెప్పుకొనే మోదీ ఆరేళ్లలో దేశాన్ని బలహీనపరిచారని ఆక్షేపించారు. హిసువా, భాగల్పూర్‌ల్లో జరిగిన సభల్లో రాహుల్ పాల్గొన్నారు. కొవిడ్ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. వేల మంది శ్రామికులు, కూలీలు వందల కిలోమీటర్ల దూరం నడిచి తమ స్వస్థలాలకు చేరుకోవాల్సిన దుస్థితి. ఆఖరికి విపక్షాలు, ప్రైవేటు సంస్థలు సాయం చేద్దామనుకున్నా వారిని అడ్డుకున్నారు. వలస కూలీల దైన్యం నేటికీ తీరలేదు’ అని రాహుల్ ఎండగట్టారు. ’మోదీ శ్రామికులకు వంగి దండం పెడతారు.. కానీ వారు కష్టంలో ఉన్నపుడు మాత్రం ఆదుకోరు’ అన్నారు. బీజేపీ చేస్తున్న 19 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ప్రజల బ్యాంకు ఖాతాల్లో 15లక్షలు వేస్తామన్న హామీ లాంటిదేనని హేళన చేశారు. అసలు బిహారీలకు ఎన్‌డీఏ పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని నిలదీశారు. మోదీ-నితీశ్ కలిసి రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలవారి వెన్ను విరిచేశారన్నారు. మరోవైపు- మళ్లీ అధికారంలోకొస్తే ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను అందజేస్తామని బీజేపీ హామీ ఇవ్వడం రాజకీయ అనైతికత కిందకు వస్తుందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు.