ఖాకీ ముసుగులో చోరీలు.. వలపన్ని పట్టుకున్న పోలీసులు!

ABN , First Publish Date - 2020-12-20T01:32:42+05:30 IST

పోలీసు వేషంలో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని ముంబై పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 38 ఏళ్ల అతడిని

ఖాకీ ముసుగులో చోరీలు.. వలపన్ని పట్టుకున్న పోలీసులు!

ముంబై: పోలీసు వేషంలో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని ముంబై పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 38 ఏళ్ల అతడిని జాఫరాలీ సయ్యద్‌గా గుర్తించారు. పోలీసునంటూ నమ్మించి మోసం చేసినట్టు సయ్యద్‌పై దాదాపు 30 కేసులు నమోదు కాగా.. ఇటీవల నమోదైన ఐదు కేసుల్లో అతడు వాంటెడ్‌గా ఉన్నాడు. గత నెల రెండోవారంలో నమోదైన ఓ కేసును దర్యాప్తు చేస్తున్న విలే పార్లే పోలీసులు ఎట్టకేలకు అతడి జాడ కనిపెట్టారు. పోలీసులమంటూ ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఓ మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారయ్యారు. సీసీటీవీ ఫూటేజీ ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సయ్యద్, అతడి సహచరుడు కాశిం అలీల పనే అయ్యింటుందని అనుమానించారు. ఆ ఇద్దరి నివాసాలను తనిఖీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అప్పటికే వారు పరారయ్యారు.


నాటి నుంచి ఈ ఇద్దరి కోసం గాలిస్తున్న విలే పార్లే పోలీసులకు... శుక్రవారం ఖాలాపూర్ సమీపంలోకి సయ్యద్ వచ్చినట్టు సమాచారం అందింది. దీంతో పోలీసు బృందం అతడిని వలపన్ని పట్టుకుంది. ‘‘అతడి అరెస్టుతో దాదాపు ఐదు కొత్త కేసులు పరిష్కారం అయ్యాయి. విలే పార్లే పోలీస్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉండగా.. అందేరీ, చెంబూర్ స్టేషన్లలో మరో రెండు కేసులు నమోదయ్యాయి..’’ అని విలేపార్లే సీనియర్ ఇన్‌స్పెక్టర్ అల్కా మండవి వెల్లడించారు. కాగా సయ్యద్ సహచరుడు కాశిం అలీ కోసం కూడా పోలీసులు ప్రస్తుతం ముమ్మర గాలింపు చేపట్టారు.

Updated Date - 2020-12-20T01:32:42+05:30 IST