కేంద్రం- బెంగాల్‌ ఢీ

ABN , First Publish Date - 2020-12-13T08:11:52+05:30 IST

పశ్చిమ బెంగాల్‌- కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్రస్థాయి రాజకీయ యుద్ధం చెలరేగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాహన శ్రేణిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి ఘటన ముదిరి రాజ్యాంగ వివాదానికి...

కేంద్రం- బెంగాల్‌ ఢీ

  • నడ్డాపై దాడి కేసుతో ముదిరిన వివాదం
  • కేంద్ర సర్వీసులకు ముగ్గురు ఐపీఎస్‌లు
  • తక్షణం పంపాలని హోంశాఖ ఆదేశాలు
  • ధిక్కరించిన మమత సర్కార్‌

కోల్‌కతా/న్యూఢిల్లీ, డిసెంబరు 12: పశ్చిమ బెంగాల్‌- కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్రస్థాయి రాజకీయ యుద్ధం చెలరేగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాహన శ్రేణిపై  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి ఘటన ముదిరి రాజ్యాంగ వివాదానికి తెరతీస్తోంది. దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను తక్షణం కేంద్ర సర్వీసులకు పంపాలని ఉత్తర్వులిచ్చింది. భోలానాథ్‌ పాండే (డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ), ప్రవీణ్‌ త్రిపాఠి (ప్రెసిడెన్సీ రేంజ్‌ డీఐజీ), రాజీవ్‌ మిశ్రా (దక్షిణ బెంగాల్‌ ఏడీజీ) అనే ఈ ముగ్గురూ నడ్డా బెంగాల్‌ పర్యటనలో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షణకు నియమితులైనవారు. ఈ ముగ్గురికీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా శనివారంసమన్లు పంపారు. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు తక్షణం రిలీవ్‌ అయి, తమకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు పంపారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి మీద వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి సమన్లు పంపిన మరుసటి రోజే కేంద్ర హోంశాఖ ఈ ముగ్గురికీ సమన్లు పంపడం విశేషం. ఈ చర్యపై తృణమూల్‌ కాంగ్రెస్‌ భగ్గుమంది. ’ఆ ముగ్గురూ చేసిన తప్పేంటి? వారు నడ్డా కాన్వాయ్‌కు అతి సమీపాన ఉండి భద్రతను దగ్గరుండి చూశారు. మీరు పంపిన ఉత్తర్వులు అసాధారణం, రాజకీయ దురుద్దేశాలతో కూడినవి. బీజేపీకి చెందిన మంత్రి (అమిత్‌ షా) ఆదేశాల మేరకు, బీజేపీకే చెందిన ఓ నేత (నడ్డా) భద్రత వ్యవహారంపై ఇలా సమన్లు పంపడం రాజకీయం కాదా? ఇది సమాఖ్య వ్యవస్థకు,  స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర ఆదేశాలకు టీఎంసీ తలొగ్గదు. వారిని డిప్యుటేషన్‌పై పంపాలని అడగడం వరకే కేంద్రం చేయగలదు. పంపడం- పంపకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఈ విషయంలో మమత సర్కార్‌దే తుది నిర్ణయం’’ అని తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ హోంశాఖ కార్యదర్శి భల్లాకు రాసిన లేఖలో ఘాటుగా బదులిచ్చారు.


హోంశాఖ వర్గాలు భల్లా లేఖను సమర్థించుకున్నప్పటికీ- సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మొదట తెలియపరిచి డిప్యుటేషన్‌ మీద కేంద్ర సర్వీసులకు పంపాలని కోరాల్సి ఉంటుందని అంటున్నాయి. ఏకపక్షంగా సమన్లు పంపినట్లు అంగీకరించాయి. అయితే సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఇలా నోటీసులు పంపొచ్చని పేర్కొంటున్నాయి. కానీ టీఎంసీ లోక్‌సభ సభ్యుడు  సౌగతా రాయ్‌ దీంతో విభేదించారు. ‘రాజ్యాంగంలోని 312 అధికరణం కింద ఐఎఎస్‌, ఐపీఎ్‌సల నియామకాలు, బదిలీలు ఉంటాయి. ఒకసారి ఓ అధికారిని ఓ రాష్ట్రానికి కేటాయించాక- ఇక ఆ రాష్ట్ర  ప్రభుత్వానికే ఆయన బదిలీలపై పూర్తి అధికారముంటుంది. కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌కు పంపాల్సిందిగా కొన్ని పేర్లను మాత్రం కేంద్ర సర్కార్‌ సూచించగలదు. వారిని రిలీవ్‌ చేసే అధికారం పూర్తిగా రాష్ట్రానిదే’ అని స్పష్టం చేశారు. ’ఈ ముగ్గురు ఐపీఎ్‌సలతో పాటు సీఎస్‌, డీజీపీలకూ నోటీసులిచ్చారు. ఇదీ రాజకీయమే.. శాంతిభద్రతల అంశం 7వ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం.  ఉన్నతాధికారులకు నోటీసులివ్వడం ద్వారా కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని చూస్తోంది. శాంతిభద్రతల సాకు చూపి, కనీసం చర్చించకుండా ఇద్దరు ఉన్నతాధికారులకు ఎలా నోటీసులిస్తారు?’ అని కల్యాణ్‌ బెనర్జీ తన లేఖలో ఎదురుదాడి చేశారు.  ఆయన లేఖపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి కైలాశ్‌ విజయవర్గీయ స్పందించారు. ఈ నెల 10న ఏం జరిగిందో అందరికీ తెలుసని, నడ్డా కాన్వాయ్‌పై టీఎంసీ శ్రేణులు ఎలా దాడికి తెగబడ్డాయో కూడా చూశారని చెప్పారు. కల్యాణ్‌ లేఖలో విషయం లేదని, ఆయన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హింసా-రహిత, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని కోరుకునే హక్కు బెంగాల్‌ ప్రజలకు ఉందంటూ మమత సర్కార్‌పై మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కఢ్‌.  అధికార కేంద్రాల్లో చొరబాటుదారులు తిష్టవేశారని, వారిని తరిమెయ్యాలని ఆయన పరోక్షంగా తృణమూల్‌ నేతలపై విరుచుకుపడ్డారు. 



కేంద్ర హోంశాఖకు అప్పగిస్తాం: ఎన్‌సీడబ్ల్యూ

బెంగాల్‌ నుంచి వచ్చిన 260 ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వాటిని కేంద్ర హోం శాఖకు అప్పగించాల్సి ఉంటుందని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ రేఖా శర్మ చెప్పారు. ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు కోల్‌కతా వచ్చిన ఆమె శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. గత 8 నెలలుగా 267 ఫిర్యాదులు వచ్చాయని, వీటికి సంబంధించి రాష్ట్రం ఎలాంటి నివేదికా పంపలేదన్నారు. దీనిపై తాను మమతకు లేఖ రాస్తానని చెప్పారు.


Updated Date - 2020-12-13T08:11:52+05:30 IST