ఎన్నికల వేళ బెంగాల్ ప్రజలకు మమత మరో వరం!

ABN , First Publish Date - 2020-11-27T04:43:10+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘స్వస్త్య సాథి’ ఆరోగ్య పథకంపై

ఎన్నికల వేళ బెంగాల్ ప్రజలకు మమత మరో వరం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘స్వస్త్య సాథి’ ఆరోగ్య పథకంపై సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలందరికీ వర్తింపజేస్తామని ఆమె పేర్కొన్నారు. వచ్చేనెల 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ... కుల, మత, వృత్తిపరమైన అంశాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూర్చుతామని సీఎం తెలిపారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశం సందర్భంగా మమత మాట్లాడుతూ.... ‘‘ఇంతకు ముందు మేము ‘స్వస్త్య సాథి’ పథకం కింద 7.5 కోట్ల మంది లబ్ధి దారులను నమోదు చేయాలని నిర్ణయించాం. అయితే ఇకపై పశ్చిమ బెంగాల్లోని ప్రతి కుటుంబాన్నీ, ప్రతి వ్యక్తినీ ఈ పథకంలోకి తీసుకువస్తాం. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ దీన్ని వర్తింపజేస్తాం..’’ అని పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే విధంగా ప్రతి కుటుంబానికి ఓ స్మార్ట్ కార్డు ఇస్తామన్నారు. 2016 డిసెంబర్‌లో మమత సర్కారు అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రతియేటా  కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మెడికల్ కవరేజ్ అందిస్తారు. 

Updated Date - 2020-11-27T04:43:10+05:30 IST