పిల్లల పెంపకానికి ఇక ఒంటరి తండ్రులకూ సెలవులు!

ABN , First Publish Date - 2020-10-27T22:25:15+05:30 IST

ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అవివాహితులు, భార్య నుంచి విడిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు..

పిల్లల పెంపకానికి ఇక ఒంటరి తండ్రులకూ సెలవులు!

న్యూఢిల్లీ: వివిధ కారణాల వల్ల ఒంటరి తండ్రులుగా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు వారికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనుంది. ఈ మేరకు  కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అవివాహితులు, భార్య నుంచి విడిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు.. పిల్లల సంరక్షణార్థం సెలవులు తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యాన్ని తెచ్చే మార్గంగా, ప్రగతిశీల సంస్కరణగా మంత్రి దీనిని అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఎప్పుడో విడుదల చేసినప్పటికీ ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లలేదన్నారు.


పిల్లల సంరక్షణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు అనుమతితో హెడ్‌క్వార్టర్స్‌ను కూడా విడిచి వెళ్లవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగి చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్నప్పటికీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) కూడా పొందవచ్చని వివరించింది. సెలవులో ఉన్న మొదటి 365 రోజులకు పూర్తిస్థాయిలో వేతనం, ఆ తర్వాత 365 రోజులకు 80 శాతం వేతనం ఇవ్వనున్నట్టు జితేంద్రసింగ్ తెలిపారు. దివ్యాంగ పిల్లల విషయంలో ఆ చిన్నారికి 22 ఏళ్లు వచ్చే వరకు పిల్లల సంరక్షణ సెలవు పొందే వెసులుబాటు ఇప్పటి వరకు ఉండగా, ఇప్పుడు దానిని ఎత్తివేశారు. ఇకపై ఏ వయసులోనైనా దివ్యాంగ పిల్లల కోసం ప్రభుత్వ ఉద్యోగి చైల్డ్ కేర్ లీవ్ పొందవచ్చు.

Updated Date - 2020-10-27T22:25:15+05:30 IST