చైనాపై మొదటిసారి మండిపడ్డ మలేసియా

ABN , First Publish Date - 2020-08-17T02:02:00+05:30 IST

దక్షిణ చైనా సముద్రంలో హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనను మలేసియా

చైనాపై మొదటిసారి మండిపడ్డ మలేసియా

కౌలాలంపూర్ : దక్షిణ చైనా సముద్రంలో హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనను మలేసియా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మలేసియా విదేశాంగ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ పార్లమెంటులో మాట్లాడుతూ, దక్షిణ చైనా సముద్రంలో తమకు చారిత్రక హక్కులు ఉన్నాయని చైనా చేస్తున్న వాదను మలేసియా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మలేసియాకు చైనా అతి పెద్ద వ్యాపార భాగస్వామి కావడం గమనార్హం. 


పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా  హిషాముద్దీన్ హుస్సేన్ మాట్లాడుతూ, దక్షిణ చైనా సముద్రంలో మారిటైమ్ ఫీచర్స్‌పై హక్కులున్నాయని చైనా చేస్తున్న వాదనకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎటువంటి ఆధారం లేదని మలేసియా ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. 


మలేసియా ఈ విధంగా చైనాపై బహిరంగంగా విరుచుకుపడటం ఇదే మొదటిసారి. వ్యాపారానికి దారులు తెరచి, చైనాతో సత్సంబంధాల వైపు మొగ్గు చూపుతూ ఉండేది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో మలేసియా ప్రత్యేక ఆర్థిక మండలిలోకి చైనా నౌకలు 89 సార్లు అక్రమంగా ప్రవేశించినట్లు ఇటీవల మలేసియా ప్రభుత్వం గుర్తించింది. మలేసియా జలాల్లో 100 రోజులపాటు చైనా నౌకలు చొరబడినట్లు గుర్తించింది. 


చైనా ప్రభుత్వ సర్వే నౌక హాయంగ్ డిఝి 8, చైనీస్ కోస్ట్ గార్డ్ నౌక కలిసి మలేసియా ప్రత్యేక ఆర్థిక మండలిలో ప్రవేశించాయి. మలేసియా ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పెట్రోనాస్‌తో కాంట్రాక్టు క్రింద ఉన్న డ్రిల్‌షిప్ సమీపంలో సర్వే చేయడం ప్రారంభించింది. దీనిపై  హిషాముద్దీన్ హుస్సేన్ మాట్లాడుతూ, పెద్ద ఎత్తున దౌత్యపరమైన ప్రయత్నాలు చేసిన తర్వాత చైనీస్ కోస్ట్ గార్డ్, ఫిషింగ్ మిలీషియా మే నెలలో వెనుకకు వెళ్ళినట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-17T02:02:00+05:30 IST