టీకా తప్పనిసరి చేయం
ABN , First Publish Date - 2020-12-06T07:05:08+05:30 IST
అమెరికాలో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయబోమని ఆ దేశ అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ప్రకటించారు. అమెరికా పౌరులకు వ్యాక్సిన్ విషయంలో బలవంతం ఏమి ఉండబోదన్నారు.

అలాంటి ఆంక్షలను ప్రజలపై రుద్దబోం
నేనూ బహిరరగంగా వ్యాక్సిన్ వేసుకుంటా
8అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత బైడన్ వెల్లడి
వాషింగ్టన్, డిసెంబరు 5: అమెరికాలో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయబోమని ఆ దేశ అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ప్రకటించారు. అమెరికా పౌరులకు వ్యాక్సిన్ విషయంలో బలవంతం ఏమి ఉండబోదన్నారు. అయితే.. టీకాపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసాన్ని కలిగించేందుకు తనతోపాటు.. ప్రస్తుతం జీవించి ఉన్న నలుగురు మాజీ అధ్యక్షుల్లో ముగ్గురు బహిరంగంగా వ్యాక్సిన్‌ను తీసుకుంటామని చెప్పారు. విల్మింగ్టన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓ వంద రోజుల పాటు మాస్కుల ధారణను కచ్చితంగా పాటించాలని.. అప్పటికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. మాస్కుల నిబంధన కూడా ఉండబోదని పేర్కొన్నారు. ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం మరణాల రేటును తగ్గించడమే అన్నారు.
పంపిణీలో రష్యా దూకుడు
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో రష్యా దూకుడు పెంచింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ పరిశోధనలో భాగంగా.. ఇప్పటికే లక్ష మందికి టీకా ఇచ్చిన రష్యా.. శనివారం నుంచి వైద్యులు-వైద్య సిబ్బంది, టీచర్లు, హైరిస్క్ కేటగిరీలో ఉన్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఎక్కడిక్కడ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఆయా వర్గాల నుంచి పేర్లను నమోదు చేసుకుంటోంది. శనివారం తొలి దశ వ్యాక్సినేషన్ ఏర్పాట్లలో భాగంగా.. ఒక్క మాస్కోలోనే 70 టీకా కేంద్రాలను ప్రారంభించారు. కాగా.. ఎడారి రాజ్యంలో ద్వీపదేశమైన బహ్రెయిన్‌కు ఫైజర్ టీకా అందనుంది.
ఈ టీకాను వినియోగించనున్న రెండో దేశంగా బహ్రెయిన్ గుర్తింపు పొందనుంది. కాగా, కొవిడ్-19 అంతంపై కలలు కనొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. వ్యాక్సిన్ వచ్చినా.. కరోనా దీర్ఘకాలం ఉంటుందని ఇంతకాలం చెబుతూ వచ్చిన డబ్ల్యూహెచ్‌వో.. తొలిసారి కరోనా అంతంపై సానుకూలంగా స్పందించింది. వ్యాక్సిన్ విషయంలో పేద, మధ్య ఆదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించకూడదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయపడ్డారు.