తాళం తీయొద్దు

ABN , First Publish Date - 2020-04-28T07:58:03+05:30 IST

దేశంలో కరోనాపై పోరాటం కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకూ అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా సోకిన రెడ్‌ జోన్లలో తప్ప...

తాళం తీయొద్దు

  • మే 3 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపులొద్దు
  • మెజారిటీ ముఖ్యమంత్రుల స్పష్టీకరణ
  • గ్రీన్‌జోన్లలో వాణిజ్యానికి కొందరు ఓకే
  • ప్రధానితో 3 గంటలు వీడియో కాన్ఫరెన్స్‌
  • వచ్చే కొద్ది నెలలు ప్రభావం తప్పదు
  • ఎడం పాటించాలి.. మాస్క్‌ పెట్టాలి
  • ఇది జీవన విధానంలో భాగం కావాలి
  • టెక్నాలజీ వాడకాన్ని పెంచాలి: మోదీ
  • జూన్‌-జులైల్లో కరోనా మరింత తీవ్రం?
  • ప్రధాని చెప్పారంటున్న ఛత్తీస్‌గఢ్‌ మంత్రి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనాపై పోరాటం కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకూ అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా సోకిన రెడ్‌ జోన్లలో తప్ప, మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించవచ్చని ప్రతిపాదించారు. సోమవారం ఆయన హోంమంత్రి అమిత్‌షాతో కలిసి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మోదీ లాక్‌డౌన్‌ సడలింపులపై ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరారు. మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సడలింపులు లేకుండా మే మూడో తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరారు. ఎలాంటి కేసుల్లేని గ్రీన్‌ జోన్లలో పరిమిత వాణిజ్య కార్యకలాపాలను అనుమతించాలని కొన్ని రాష్ట్రాల సీఎంలు సూచించారు. ఇదే విషయాన్ని సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ధ్రువీకరించారు. గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, కేరళలు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే వైఖరిని తీసుకోగా, తెలంగాణ ఇప్పటికే మే 7 వరకు పొడిగించింది. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌, పంజాబ్‌, ఒడిసాలు లాక్‌డౌన్‌ ఎత్తివేతకు వ్యతిరేకమని ప్రకటించాయి. మరోపక్క నెలన్నర రోజుల లాక్‌డౌన్‌ విజయవంతమైందని ప్రధాని ప్రకటించారు. కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు వీలుగా జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా వర్గీకరించాలని ప్రతిపాదించారు. దీన్ని బట్టి లాక్‌డౌన్‌ను ఎక్కడ ఎత్తివేయవచ్చో స్పష్టమైన అంచనా ఏర్పడుతుందని చెప్పారు. తక్కువ కేసులు ఉండే ఆరెంజ్‌ జోన్లో, అసలు కేసులే లేని గ్రీన్‌ జోన్లో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని రాష్ట్రాలను కోరారు. 


నిరంతరం అప్రమత్తం

కరోనా వైరస్‌ ప్రమాదం పూర్తిగా పోలేదని, నిరంతరం అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న నెలల్లో కూడా కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారన్నారు. ఇతర దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను వెనక్కి రప్పించే విషయమై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. దశల వారీగా వ్యాపార కార్యకలాపాలు అనుమతించాలని ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ అన్నారు. కట్టడి ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించామని హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. కేరళ సీఎం విజయన్‌ సమావేశంలో పాల్గొనలేదు.  


3 తర్వాతా స్కూళ్లు, ప్రజా రవాణా బంద్‌!

రెండోసారి విధించిన లాక్‌డౌన్‌ గడువు మే3తో ముగియనున్న నేపథ్యంలో దీని తర్వాత కూడా విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, మతపరమైన ప్రాంతాలు, ప్రజా రవాణా సదుపాయాల మూసివేత కొనసాగే అవకాశం ఉందని అఽధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. గ్రీన్‌ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లో మాత్రం పరిమిత స్థాయిలో ప్రైవేటు వాహనాలను అనుమతించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. అయితే ట్రెయిన్‌, విమాన సర్వీసులు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదన్నారు. మే 3 తర్వాత పాఠశాలలు కళాశాలలు, షాపింగ్‌ మాల్స్‌, మతపరమైన ప్రాంతాలు, ప్రజా రవాణా వంటివి మూసిఉండే అవకాశం ఉందని, ప్రజలు, సామాజిక సమావేశాలపై నిషేధాజ్ఞలు కొనసాగవచ్చని తెలిపారు. అయితే వారాంతంలో లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ఆ అధికారి చెప్పారు. 


నిధులు అడిగిన ఇద్దరు సీఎంలు

సమావేశంలో 9 మంది ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు కరోనాపై పోరుకు రాష్ట్రాలకు కేంద్రం నిధులు అందించాలని అభ్యర్థించారు. మిగతా ఏడుగురు సీఎంలు ప్రధాని నాయకత్వాన్ని కొనియాడారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని నవీన్‌ పట్నాయక్‌ డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే ముఖ్యమైన కార్యకలాపాలను అనుమతించాలని కోరారు. సభలు, మత, విద్యాపరమైన సంస్థల మూసివేత కొనసాగాలని, ఆర్థిక కార్యకలాపాలు రాష్ట్రం సరిహద్దుల్లోపే జరగాలని కోరారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇతర వైద్య ఉపకరణాలను కేంద్రం సరఫరా చేయాలని నారాయణ స్వామి కోరారు. జూన్‌, జూలైల్లో కరోనా సమస్య తీవ్రంగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పినట్లు ఛత్తీ్‌సగఢ్‌ ఆరోగ్య మంత్రి సింగ్‌దేవ్‌ తెలిపారు. 


వర్షాకాలం జాగ్రత్త

వేసవి, వర్షాకాలాల్లో వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు కరోనాకు తోడవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అందుకు తగ్గట్టు వ్యూహాలను రచించుకోవాలి. దేశ ప్రజలందరూ రెండు గజాల ఎడం పాటించాలి. మాస్కులు ధరించడాన్ని జీవన విధానంలో భాగం చేసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. దాని గురించి చింతించాల్సిన పని లేదు.

-ప్రధాని నరేంద్ర మోదీ

Updated Date - 2020-04-28T07:58:03+05:30 IST