రిటైర్మెంట్ త‌ర్వాత‌ ధోనీ ఏం చేయ‌నున్నారంటే...

ABN , First Publish Date - 2020-08-16T11:20:31+05:30 IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దీంతో ధోనీ క్రికెట్ నుంచి...

రిటైర్మెంట్ త‌ర్వాత‌ ధోనీ ఏం చేయ‌నున్నారంటే...

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దీంతో ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత ఏమి చేస్తార‌నే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ధోనీ త‌న రిటైర్మెంట్ త‌రువాత ఏమిచేయా‌ల‌నే దానిపై తన బాల్యంలోనే ప్లాన్ చేశార‌ట‌. రాంచీ జవహర్ విద్యా మందిర్ నుంచి 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ధోని  ఆ త‌రువాత రాంచీలోని గోస్స‌న‌ర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. క్రికెట్ కెరీర్ కారణంగా త‌రువాత  చదువుకోలేకపోయాడు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ధోనీ 2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో వొకేషనల్ స్టడీస్ అయిన‌ ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో బ్యాచిలర్ డిగ్రీలో చేరారు. అయితే క్రికెట్‌పై ఆసక్తి కార‌ణంగా ఆరు సెమిస్ట‌ర్ల‌లో ఒక్కదానిలోనూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గ‌తంలో ఒక‌సారి విద్యార్థులతో సమావేశమైనప్పుడు ధోనీ తాను చదువులో గొప్ప‌గా రాణించ‌లేద‌ని, టెన్త్‌లో 66 శాతం, ఇంట‌ర్‌లో 56 శాతం మార్కులు మాత్ర‌మే సాధించాన‌ని తెలిపారు. ఇంట‌ర్‌లో తొలిసారి క్లాస్ బంక్ చేశానని, బోర్డు పరీక్షల స‌మ‌యంలోనూ రాంచీకి బ‌య‌ట‌ క్రికెట్ ఆడేందుకు వెళ్లాన‌ని తెలిపారు. కాగా 2011, న‌వంబ‌రులో ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. భవిష్యత్తులో ఈ బాధ్యతను నెరవేర్చడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ధోనీ తెలిపారు. త‌ద్వారా ఆర్మీలో పనిచేయాలన్న త‌న‌ కల నెరవేరుతుంద‌న్నారు. బాల్యంలో తాను సైనికుడిగా మారాలని కోరుకునేవాడిన‌ని ధోనీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

Updated Date - 2020-08-16T11:20:31+05:30 IST