చైనాతో కటీఫ్..రూ.5,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రద్దు

ABN , First Publish Date - 2020-06-22T23:14:47+05:30 IST

లడక్‌లోని గల్వాన్ లోయలో చైనా దురాగతంపై మహారాష్ట్ర సర్కార్ కత్తిదూసింది. చైనాతో ప్రతిపాదిత 3 ప్రాజెక్టులను..

చైనాతో కటీఫ్..రూ.5,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రద్దు

ముంబై: లడక్‌లోని గల్వాన్ లోయలో చైనా దురాగతంపై మహారాష్ట్ర సర్కార్ కత్తిదూసింది. చైనాతో ప్రతిపాదిత 3 ప్రాజెక్టులను ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.5,000 కోట్లు. ఇటీవల ముంబైలో జరిగిన 'మేగ్నటిక్ మహరాష్ట్ర 2.0' ఇన్వెస్టర్ మీట్‌లో చైనా కంపెనీలతో ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి సంతకాలు జరిగాయి. లడక్ ఘర్షణలకు కొద్ది రోజులకు ముందే ఈ ఇన్వెస్టర్ మీట్ జరిగింది.


కేంద్రంతో సంప్రదించిన అనంతరమే మూడు ప్రాజెక్టుల సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టులను హోల్డ్‌లో ఉంచామని, కేంద్రం నుంచి తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. గత సోమవారంనాడు జరిగిన 'మేగ్నెటిక్ మహారాష్ట్ర 2.0' ఇన్వెస్టర్ మీట్‌లో చైనా రాయబారి సన్ వియిడాంగ్ పాల్గొన్నారు. చైనాతో పాటు మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించి దక్షిణ కొరియా, సింగపూర్, అమెరికాలతో సంతకాలు జరిగాయి.


కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన మూడు ప్రాజెక్టులలో హెంగ్లీ ఇంజనీరింగ్‌తో కుదుర్చుకున్న రూ.250 కోట్లు విలువ చేసే ప్రాజెక్టు, గ్రేట్ వాల్ మోటార్స్‌తో కుదుర్చుకున్న రూ.3,770 కోట్ల ప్రాజెక్టు, రూ.1,000 కోట్లు విలువ చేసే పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ ప్రాజెక్టు ఉన్నాయి.

Updated Date - 2020-06-22T23:14:47+05:30 IST