పోలీసులకు కరోనా సోకితే తక్షణమే రూ. లక్ష అడ్వాన్స్..
ABN , First Publish Date - 2020-04-22T00:01:55+05:30 IST
కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర పోలీస్ శాఖ..

ముంబై: కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. పోలీసు సిబ్బందిలో ఎవరైనా కరోనా బారిన పడితే... వారి చికిత్స కోసం తక్షణమే రూ.1 లక్ష సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర అదనపు డీజీపీ (అడ్మినిష్ట్రేషన్) సంజయ్ కుమార్ సింఘాల్ ఉత్వర్వులు జారీ చేశారు. ‘‘పోలీసు సిబ్బందిలో ఎవరైనా కరోనా బారిన పడితే.. పోలీస్ సంక్షేమ నిధి నుంచి తక్షణమే వారికి రూ. 1 లక్ష అడ్వాన్స్ జమచేయాలని యూనిట్ కమాండర్లందరికీ ఆదేశిస్తున్నాం..’’ అని సంజీవ్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా ఇటీవల యూనిట్ కమాండర్లతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ ఇప్పటికే దీనిపై మౌఖిక ఆదేశాలు జారీచేశారు. మహారాష్ట్రలో ఎనిమిది మంది అధికారులు సహా ఇప్పటి వరకు 37 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో అత్యధికంగా ముంబై నుంచే కొవిడ్-19కు గురైనట్టు గుర్తించారు. లాక్‌డౌన్‌లో విధి నిర్వహణ సందర్భంగా కరోనా సోకిన వారి నుంచి పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో దాదాపు 20 వేల మంది అధికారులు సహా మొత్తం 2.2 లక్షల పోలీసు సిబ్బంది ఉన్నారు.