నూతన వ్యవసాయ చట్టం కింద బకాయిలు రాబట్టుకున్న మహారాష్ట్ర రైతు

ABN , First Publish Date - 2020-11-19T09:34:01+05:30 IST

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం ద్వారా మహారాష్ట్రకు చెందిన ఒక రైతు ప్రయోజనం పొందారు. ఈ చట్టం కింద లబ్ధి పొందిన తొలి వ్యక్తి ఈయనేనని తెలుస్తోంది...

నూతన వ్యవసాయ చట్టం కింద బకాయిలు రాబట్టుకున్న మహారాష్ట్ర  రైతు

భోపాల్‌, నవంబరు 18: కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం ద్వారా మహారాష్ట్రకు చెందిన ఒక రైతు ప్రయోజనం పొందారు. ఈ చట్టం కింద లబ్ధి పొందిన తొలి వ్యక్తి ఈయనేనని తెలుస్తోంది. ఈ చట్టంలోని నిబంధనల వల్ల ఇద్దరు వ్యాపారుల నుంచి తనకు రావాల్సిన రూ.2.85 లక్షల నగదును రైతు పొందగలిగాడు. మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన రైతు జితేంద్ర భోయ్‌ గత జూలైలో 270.95 క్వింటాళ్ల మొక్కజొన్నను క్వింటాల్‌కు రూ.1,240 చొప్పున ఇద్దరు వ్యాపారులకు విక్రయించాడు. వీరిద్దరికీ ఏపీఎంసీ చట్టం కింద లైసెన్స్‌ లేదు. వీరు రైతుకు బకాయి ఉన్న నగదును చెల్లించడంలో జాప్యం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల ఉత్పత్తి వర్తకం, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయం) చట్టంలోని నిబంధనల కింద రైతు ఫిర్యాదు చేశాడు. విచారణ తర్వాత.. వారం రోజుల్లో చెల్లింపులు చేయాలని వ్యాపారులకు సబ్‌ డివిజనల్‌ మెజిస్ర్టేట్‌ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.  

Updated Date - 2020-11-19T09:34:01+05:30 IST