మహోధృతం

ABN , First Publish Date - 2020-05-18T08:07:43+05:30 IST

ఎంతగా కట్టడి చేస్తున్నా.. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఆగడం లేదు. ఆదివారం ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 2,347 కేసులు...

మహోధృతం

  • మహారాష్ట్రలో కొత్తగా 2,347 కేసులు
  • థానె ఏసీపీకి కరోనా.. 33 వేలకు చేరిక
  • దేశంలో 95 వేలు.. మృతులు 2,949 
  • ముంబై ప్రభావంతో కర్ణాటకలో కేసులు 

న్యూఢిల్లీ, ముంబై, మే 17: ఎంతగా కట్టడి చేస్తున్నా.. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఆగడం లేదు. ఆదివారం ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 2,347 కేసులు నమోదయ్యాయి. శనివారం 1,600 కేసులు రాగా.. ఒక్క రోజులోనే 700పైగా పెరగడం గమనార్హం. కొత్తగా 63 మంది చనిపోతే, అందులో ముంబైవారే 38 మంది ఉన్నారు. 1,571 తాజా కేసులు కలిపి ముంబైలో కేసులు 20,150కి, మరణాలు 734కి చేరాయి. మరోవైపు దేశవ్యాప్తంగానూ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు కేసులు 95,389కి, మరణాలు 2,949కి చేరాయి. మహారాష్ట్ర పోలీస్‌ శాఖను కరోనా కుదిపేస్తోంది. థానెలో అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ వైరస్‌ బారినపడ్డారు. ముంబైలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారికి పాజిటివ్‌గా తేలడంతో అదనపు పోలీస్‌ కమిషనర్‌ సహా నలుగురు ఉద్యోగులను క్వారంటైన్‌కు పంపారు. ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎ్‌స)కు చెందిన కానిస్టేబుల్‌ వైర్‌సతో చనిపోయారు. ముంబై ప్రభావంతో  కర్ణాటకలో కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నమోదైన 55 కేసుల్లో 44 మంది ముంబైతో సంబంధం ఉన్నవారే. తమిళనాడులో కేసులు 11 వేలు దాటాయి.


తమిళనాడుతో పాటు మహారాష్ట్ర లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించాయి. ఢిల్లీలో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎ్‌ఫ)లో ఇంకో 10 మంది సిబ్బందికి కరోనా సోకింది. బెంగాల్‌లో రోగుల చికిత్సకు ఆస్పత్రుల నర్సులు బెంబేలెత్తిపోతున్నారు. 350 మందిపైగా నర్సులు ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. దేశంలో కేసుల రెట్టింపునకు పడుతున్న సమయం గత మూడు రోజులుగా 13.6 రోజులకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. అంతకుముందు 14 రోజుల వరకు ఇది 11.5 రోజులుగా ఉండేదన్నారు. మరణాల రేటు 3.1 శాతమని, రికవరీ రేటు 37.5 శాతమని చెప్పారు.  కేసులు నమోదైన ప్రాంతంలో గణాంకాల ఆధారంగా వైరస్‌ వ్యాప్తిని నిరోఽఽధించేందుకు అవకాశాలున్నాయని.. అయితే అందుకు పూర్తి హామీ ఇవ్వలేమని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి తీవ్రత అధికంగా ఉండటమే కారణంగా తెలిపింది.  


జైపూర్‌లో ఖైదీలకు.. శరణార్థులకు..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనా తీవ్రమవుతోంది. 123 తాజా కేసుల్లో 37 జైపూర్‌వే. ఇందులో 14 మంది జైళ్లలోని ఖైదీలు. పాకిస్థాన్‌ నుంచి వచ్చి జోధ్‌పూర్‌లోని శరణార్థి శిబిరాల్లో ఉన్న ఏడుగురికి వైరస్‌ సోకింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మరణాలు 100కు చేరగా, కేసులు 2,500కు సమీపించాయి. ఒక్క రోజులోనే 92 మందికి పాజిటివ్‌గా తేలింది. 


క్వారంటైన్‌కు ఒప్పుకుంటేనే రైలు టికెట్

ఇకపై క్వారంటైన్‌కు ఒప్పుకున్న వారికే ప్రత్యేక రైళ్ల టికెట్లు జారీ చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో అంగీకారం తెలపాలి. లేదంటే టికెట్‌ బుకింగ్‌ వీలుకాదు. 14న ప్రత్యేక రైలులో బెంగళూరు వెళ్లిన కొందరు క్వారంటైన్‌కు ససేమిరా అనడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.


ముంబైలో మరో 50 వేల బెడ్లు 

రోజూ భారీగా కేసులు తేలుతున్న ముంబైలో పడకల సామర్థ్యాన్ని లక్షకు పెంచేందుకు నిర్ణయించారు. ఇప్పటికే పడకలను 50 వేలకు పెంచారు. ప్రసిద్ధ వాంఖడే క్రికెట్‌ స్టేడియాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా వినియోగించనున్నారన్న వార్తలను నగర కమిషర్‌ ఐఎస్‌ చహల్‌ ఖండించారు. దీనికి బదులుగా విమానాశ్రయ, ఆరే ఏరియా, శాంతాక్రజ్‌, బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రుల్లోని పార్కింగ్‌ ప్రాంతాలను ఐసోలేషన్‌ పడకలకు వినియోగించుకోవచ్చన్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 800 బెడ్లను వాడుకలోకి తేనున్నారు.

Updated Date - 2020-05-18T08:07:43+05:30 IST