కాంగో ఫీవర్‌పై అధికారుల తాజా హెచ్చరిక

ABN , First Publish Date - 2020-09-29T19:06:34+05:30 IST

కాంగో జ్వరాలు ప్రజలను వణికిస్తున్న నేపథ్యంలో పాల్ఘార్ జిల్లా అధికారులు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు.....

కాంగో ఫీవర్‌పై అధికారుల తాజా హెచ్చరిక

పాల్ఘార్ జిల్లాను వణికిస్తున్న కాంగో ఫీవర్

పాల్ఘార్ (మహారాష్ట్ర): కరోనా మహమ్మారికి తోడు కాంగో జ్వరాలు ప్రబలడంతో మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాంగో జ్వరాలు ప్రజలను వణికిస్తున్న నేపథ్యంలో పాల్ఘార్ జిల్లా అధికారులు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. కాంగో జ్వరం సోకకుండా ప్రజలు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.  క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సిసిహెచ్ఎఫ్) పేలు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతోంది. కాంగో జ్వరాల నివారణకు సరైన చికిత్స లేనందువల్ల పశువుల పెంపకం దారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. 


మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా గుజరాత్ లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా ఉన్నందువల్ల ప్రజలు దీని నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ జ్వరం జంతువుల ద్వారా వ్యాపిస్తుందని, ప్రజలు ఈ జ్వరం సోకిన జంతువుల మాంసాన్ని తినడం వల్ల వస్తుందని డాక్టర్ చెప్పారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధికి చికిత్స చేయించుకోకపోతే మరణించే ప్రమాదముందని పాల్ఘార్ వైద్యాధికారులు హెచ్చరించారు. 


గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కాంగో జ్వరాలు ప్రబలాయని, ఈ జ్వరాలు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని పాల్ఘార్ జిల్లా పశుసంవర్ధకశాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే విడుదల చేసిన హెచ్చరికలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-29T19:06:34+05:30 IST