ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ

ABN , First Publish Date - 2020-06-25T06:13:21+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పీజీ మెడికల్ ఫైనల్ ఎగ్జామ్స్‌ను...

ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పీజీ మెడికల్ ఫైనల్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని ఆయన లేఖలో ప్రధానిని కోరారు. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి ఆయన విన్నవించారు. ఎండీ(డాక్టర్ ఆఫ్ మెడిసిన్), ఎంఎస్(మాస్టర్ ఆఫ్ సర్జరీ) పరీక్షలను డిసెంబర్ వరకూ వాయిదా వేయాలని ఉద్ధవ్ లేఖలో కోరారు. ఫైనల్ ఇయర్ రెసిడెంట్ డాక్టర్స్ కరోనా పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నేపథ్యంలో వారి వైద్య సేవలు ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం జూలై 15 నుంచి ఈ పరీక్షలు జరగాల్సి ఉంది.


ఈ పరీక్షల కారణంగా ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్స్ వెళ్లిపోతే మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్సనందిస్తున్న ట్రైనీ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంటుందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని ప్రధాని మోదీని ఉద్ధవ్ కోరారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం కోరారు. మహారాష్ట్రలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువలో ఉంది.

Updated Date - 2020-06-25T06:13:21+05:30 IST