బీహార్: మహాకూటమి సీట్ల పంపకాలు ఖరారు.. సీఎం అభ్యర్థిగా తేజస్వి..
ABN , First Publish Date - 2020-10-04T00:38:53+05:30 IST
బీహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం మహాకూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంపై స్పష్టత వచ్చింది...
పాట్నా: బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారైనట్టు మహాకూటమి ప్రకటించింది. కూటమి పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. సింహభాగం సీట్లు ఆర్జేడీకి దక్కాయి. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లోనూ, వామపక్షాలు 29 స్థానాల్లోనూ బరిలో నిలవనున్నాయి. వామపక్షాలకు కేటాయించిన సీట్లలో 19 సీట్లు సీపీఐ ఎంఎల్‌కు దక్కగా.. సీపీఎం, సీపీఐ పార్టీలు వరుసగా 4, 6 స్థానాల్లో పోటీచేయనున్నాయి. వికాస్ ఇన్సాఫ్ పార్టీ (వీఐపీ), జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థులకు ఆర్జేడీ సీట్లు కేటాయించనుంది.
ఇక ఒకే ఒక లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించాలని మహాకూటమి నిర్ణయించింది. కాగా సీట్ షేరింగ్ ఫార్ములాతో పాటు సీఎం అభ్యర్థిని కూడా మహా కూటమి ప్రకటించింది. తమ తరపున సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ప్రతిపక్ష నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను నిలబెడుతున్నట్టు బీజేపీ వ్యతిరేక కూటమి వెల్లడించింది. తేజస్వి యాదవ్ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడన్న విషయం తెలిసిందే. సీట్ షేరింగ్ ఫార్ములాను ప్రకటించడం ద్వారా ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్ష కూటమి ఎన్డీయే కూటమి కంటే ఒక అడుగు ముందుకెళ్లినట్టైంది. బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు.