మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2020-06-22T23:52:06+05:30 IST

తమిళనాడులో పరువు హత్యకు గురైన దళిత యువకుడు శంకర్ హత్య కేసులో...

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

పరువు హత్య కేసులో నిందితులకు మరణ శిక్ష రద్దు

చెన్నై: తమిళనాడులో పరువు హత్యకు గురైన దళిత యువకుడు శంకర్ హత్య కేసులో మద్రాస్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువతి తండ్రి చిన్నస్వామికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు, శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేసి.. వారి శిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుకు మార్చుతూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది.


మద్రాస్ హైకోర్టు వెల్లడించిన ఈ తీర్పు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు పట్ల శంకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్నస్వామి కుమార్తె కౌసల్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతామని తెలిపింది. ఈ తీర్పు అన్యాయమని, శంకర్ నెత్తుటి మరకల సాక్షిగా ఇది న్యాయం కాదని ఆమె చెప్పింది. 


తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన శంకర్, అగ్ర కులానికి చెందిన కౌసల్య ప్రేమించుకున్నారు. శంకర్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగా కౌసల్య కుటుంబం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమెను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నాటికి శంకర్ వయసు 23 సంవత్సరాలు కాగా కౌసల్య వయసు 19. వీరిద్దరిపై మార్చి 2016లో రోడ్డుపై వెళుతుండగా పట్టపగలే బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో కౌసల్యకు స్వల్ప గాయాలు కాగా.. శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించాడు.


ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. శంకర్‌పై దాడి చేయించింది కౌసల్య తండ్రి చిన్నస్వామినేనని ఆరోపణలు రావడంతో అతనిని, అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 2017లో వీరందరికీ మరణ శిక్షను విధించగా.. మద్రాస్ హైకోర్టు తాజాగా మరణ శిక్షను రద్దు చేస్తూ తీర్పును సోమవారం వెల్లడించింది. కౌసల్య ప్రస్తుతం శంకర్ కుటుంబంతోనే ఉంటోంది. ఆమె డిసెంబర్, 2018లో మరో పెళ్లి చేసుకుంది.

Updated Date - 2020-06-22T23:52:06+05:30 IST