పోలీసులపై దాడిచేసిన తండ్రీకొడుకుల అరెస్ట్.. వారి ద్వారా 20 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-04-29T03:37:40+05:30 IST

విధుల్లో ఉన్న పోలీసులపై దాడిచిన తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే.. వారి ద్వారా 20

పోలీసులపై దాడిచేసిన తండ్రీకొడుకుల అరెస్ట్.. వారి ద్వారా 20 మందికి కరోనా

భోపాల్: విధుల్లో ఉన్న పోలీసులపై దాడిచేసిన తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే.. వారి ద్వారా 20 మందికి ప్రాణాంతక కరోనా వైరస్ సోకింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. పోలీసులపై దాడిచేసిన తండ్రీకొడుకులను జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) కింద  అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరి కారణంగా జబల్‌పూర్‌లోని ఓ ఐపీఎస్ అధికారి, ఇద్దరు జైలు గార్డులు, ఇండోర్ సెంట్రల్ జైలులోని 17 మంది ఖైదీలు వైరస్ బారినపడ్డారు.

  

పోలీసులపై దాడిచేసిన తండ్రీ, కొడుకులతోపాటు మరో ఐదుగురిని ఈ నెల 7న ఇండోర్‌లోని చందన్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. కుమారుడిని జబల్‌పూర్ జైలుకు పంపగా, తండ్రిని ఇండోర్ సెంట్రల్ జైలుకు పంపారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు కంటైన్‌మెంట్ జోన్‌కు చెందిన వ్యక్తి కావడంతో అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్టు ఇండోర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ భాంగ్రే తెలిపారు.

  

ఏప్రిల్ 10న జబల్‌పూర్ జైలులో ఉన్న కుమారుడికి కరోనా సోకినట్టు తెలియడంతో, ఇండోర్ జైలులో ఉన్న అతడి తండ్రిని ఆ తర్వాతి రోజు ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 14న అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టు భాంగ్రే తెలిపారు. జైలులో అతడితోపాటు ఉన్న 125 మంది ఖైదీల్లోనూ కోవిడ్ తరహా లక్షణాలు కనిపించడంతో వారిందరినీ క్వారంటైన్ చేశారు. ఆ తర్వాత అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 17 మంది కరోనా సోకినట్టు సోమవారం రాత్రి నిర్ధారణ అయింది. అలాగే, ఇద్దరు జైలు గార్డులకు కూడా పాజిటివ్ అని తేలినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-29T03:37:40+05:30 IST