ఆరుగురు మంత్రులను తొలగించిన గవర్నర్

ABN , First Publish Date - 2020-03-13T23:01:18+05:30 IST

మధ్యప్రదేశ్‌ గవర్నర్ లాల్జీ టాండన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సిఫారసు మేరకు ఆయన మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులపై బహిష్కరణ వేటు..

ఆరుగురు మంత్రులను తొలగించిన గవర్నర్

భోపాల్: మధ్యప్రదేశ్‌ గవర్నర్ లాల్జీ టాండన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సిఫారసు మేరకు మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులపై గవర్నర్ బహిష్కరణ వేటు వేశారు. మంత్రివర్గం నుంచి తొలగించారు. వీరంతా కమల్‌నాథ్‌కు ఏమాత్రం అందుబాటులో లేకుండా బెంగళూరుకు తరలివెళ్లిన మంత్రులే కావడం విశేషం.


కమల్‌నాథ్ నాలుగురోజుల క్రితమే తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై మంత్రివర్గ పునర్వవస్థీకరణకు సన్నాహాలు చేశారు. సమాచారానికి ఏ మాత్రం అందుబాటులో లేకుండా బెంగళూరు తరలివెళ్లిన ఆరుగురు మంత్రులపై ఆయన బహిష్కరణ వేటుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు కూడా చేశారు. అయితే, ఆ సమయంలో గవర్నర్ లక్నో వెళ్లడంతో తాను భోపాల్ చేరుకోగానే ఆ లేఖ విషయం పరిశీలిస్తానని ఆయన చెప్పారు. భోపాల్ చేరుకున్న లాల్జీ టాండన్ ఆ లేఖను పరిశీలించి ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఆరుగురు మంత్రులను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బహిష్కరణ వేటు పడిన మంత్రుల్లో ఇమర్తి దేవి, తుల్సి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుట్, మహేంద్ర సింగ్ సిసోడియా, ప్రద్యుమ్న సింగ్ తోమర్, ప్రభురాం చౌదరి ఉన్నారు.


జ్యోతిరాదిత్య ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే, బెంగళూరుకు వెళ్లిన ఆరుగురు మంత్రులతో సహా మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రతినిధి బృందం ఈ ఎమ్మెల్యేల లేఖలను అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతికి సమర్పించారు. వ్యక్తిగతంగా తనను ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత, వారి వివరణ, కారణాలను విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు.

Updated Date - 2020-03-13T23:01:18+05:30 IST